కులమతాలు, ప్రాంతీయవాదం… వంటివి ఏవైనా ఒక పరిధి దాటితే చాలా ప్రమాదకరంగా మారుతుంటాయి. ఇందుకు తాజా నిదర్శనంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య గురించి చెప్పుకోవచ్చు.
“అమెరికన్ కమ్ బ్యాక్” పేరుతో దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న అయన నిన్న యుటా యూనివర్సిటీలో విద్యార్ధులతో మాట్లాడుతున్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు.
ఇదివరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై కూడా ఇదేవిధంగా కాల్పులు జరుగగా త్రుటిలో తప్పించుకున్నారు. కానీ ట్రంప్ భావజాలాన్ని అమెరికా అంతటా వ్యాపింపజేస్తున్న చార్లీ కిర్క్ మాత్రం తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారు.
‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో ట్రంప్ ఎన్నికలలో సగటు అమెరికన్లను ఆకట్టుకొని మళ్ళీ అధ్యక్షుడయ్యారు. అమెరికా దేశాధ్యక్షుడుగా ట్రంప్ తన దేశ ప్రయోజనాలను, దేశ ప్రజలను కాపాడుకోవడం చాలా అవసరమే. కానీ ఆ దేశాభిమానం ఇతరుల పట్ల విద్వేషంగా కారాదు.
ట్రంప్ విపరీత ధోరణి కారణంగా అమెరికాలో స్థిరపడిన వివిధ దేశస్తులు, చివరికి అక్కడ చదువుకోవడానికి వచ్చిన విదేశీ విద్యార్ధులు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ట్రంప్ సుంకాల మోతతో యావత్ ప్రపంచ దేశాలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇవన్నీ అమెరికా ప్రయోజనాల కొరకే అని గట్టిగా సమర్ధించుకోవచ్చు.
కానీ ఈ అతి సరికాదని మెల్లమెల్లగా ఆయనకే అర్ధమవుతోంది. అందుకే ప్రధాని మోడీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు కూడా.
చార్లీ కిర్క్ స్థాపించిన ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ’ అమెరికన్ యువతలో విదేశీయుల పట్ల విద్వేష భావనలు రెచ్చగొడుతుందనే ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఆయనకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఆయన భావాజలాన్ని వ్యతిరేకించేవారు కూడా లక్షలలో ఉన్నారు.
కనుక ఒక విధ్వంసకరమైన ఆలోచనలు, విధానాలతో ముందుకు సాగితో చివరికి ఇటువంటి ముగింపు తప్పదని చార్లీ కిర్క్ హత్యతో మరోసారి నిరూపితమైంది.




