ప్రస్తుతం వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒకప్పుడు నక్సలైట్ అన్న విషయం సామాన్యులకు పెద్దగా తెలియకపోయినా, రాజకీయ విజ్ఞులకు విదితమే. పెన్ను పట్టుకోవాల్సిన వయసులో గన్ను పట్టుకుని అడవుల్లోకి వెళ్ళిన చెవిరెడ్డి, ఆ తర్వాత కాలక్రమేణా జరిగిన మార్పులలో భాగంగా… వైఎస్ తండ్రి రాజారెడ్డితో ఏర్పడిన పరిచయం రీత్యా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అలా వైఎస్ కుటుంబానికి విధేయుడిగా మారిన చెవిరెడ్డి, ప్రస్తుతం రాజకీయంగా జగన్ కు అండదండలుగా ఉన్నారు.
ఎప్పుడూ ఏదొక వివాదంతో మీడియా వర్గాలలో హల్చల్ చేసే చెవిరెడ్డి పైన దాదాపు 88 కేసులు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఓ మీడియా ఛానల్ చేసిన ‘వీకెండ్’ ఇంటర్వ్యూలో చెవిరెడ్డి తన మనోగతాన్ని బయటపెట్టారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పిన భాస్కరరెడ్డి, ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితంతో పోలిస్తే నక్సలైట్ జీవితమే మెరుగన్న భావనను వ్యక్తపరిచారు. అక్కడయితే ఏది చేయాలన్నా వెసులుబాటు ఉంటుందని, ముఖ్యంగా తన క్యారెక్టర్ కు దగ్గరగా ఉంటుంది కాబట్టి అదే ఉత్తమం అన్న అభిప్రాయాన్ని ఎలాంటి బేషజాలు లేకుండా వ్యక్తపరిచారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు లేకుండా తన జీవితం లేదని, ఆయన చూపించిన ప్రేమ, ఆప్యాయతలను గుర్తు చేసుకుంటూ కన్నిటీపర్యంతం అయ్యారు. వైఎస్ జీవితంపై పి.హెచ్.డీ చేసే అవకాశం తనకు దక్కిందని, ఆయన జీవితంలో ‘అభివృద్ధి’ తప్ప ‘అవినీతి’కి తావు లేదని వైఎస్ పై ఉన్న ప్రేమను చూపించారు. తన కన్న తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వైఎస్సార్ మాదిరి మమ్మల్ని చూసుకునే వారు కాదని, ఆయన్ని ఎప్పటికీ మరువలేము, ఎప్పుడూ గుర్తు చేసుకున్నా కన్నీళ్లు ఇలాగే వచ్చేస్తుంటాయని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు.



