జగన్ అక్రమాస్తుల కేసులో దేశవ్యాప్తంగా చాలా మంది పారిశ్రామిక వేత్తలు ఇరుక్కున్న విషయం తెలిసిందే. దీంతో కేసులు, విచారణలతో మల్లగుల్లాలు పడుతున్న ప్రముఖులలో కొందరిని ఈ నెల 28వ తేదీన ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియా హైకోర్టులో సవాల్ చేసారు.
చెన్నైకు చెందిన పునీత్ దాల్మియా విజ్ఞప్తితో చాలా కాలం తర్వాత ఒకప్పటి ఆర్ధిక మంత్రి చిదంబరం నల్లకోటు వేసుకుని, “ఈ కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగానే, తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడాన్ని తప్పుపడుతూ” వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ సోమవారం నాడు తుది తీర్పు వెలువరించారు.
చిదంబరం వాదనలతో ఏకీభవించని కోర్టు, దాల్మియా సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఈ నెల 28వ తేదీన జగన్ తో పాటు సదరు సంస్థ కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి నెలకొంది.



