లేటుగా ప్రారంభించినా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ జరుపుకోవడం మెగా అభిమానులకు సంతోషం కలిగించే విషయం. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ ప్రత్యేకమైన జైలు సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. చంచల్ గూడ జైలుగా వేసిన ఈ సెట్ లో ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలలో భాగంగా చేజింగ్ సీన్లను చిత్రీకరిస్తున్నారు.
శరవేగంగా సాగుతున్న షూటింగ్ ఇదే రేంజ్ లో కొనసాగితే, ట్రేడ్ వర్గాల్లో చెప్తున్నట్లు వచ్చే ఏడాది సంక్రాంతికి రావడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. అయితే ఇప్పటివరకు కూడా హీరోయిన్ ను ఎంపిక చేయకుండానే షూటింగ్ జరుపుతోంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ, కమర్షియల్ కోణంలో హీరోయిన్ ఎంపిక తధ్యం. అయితే, ఎందరో హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, ఎవరూ ఫైనల్ కాకపోవడం విశేషం.
వివి వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఇప్పటివరకు లీక్ అయిన మెగాస్టార్ స్టిల్స్ మరియు రైతులపై వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్ కు పిచ్చ హ్యాపీని ఇచ్చాయి. అదీ గాక, ఇటీవల తరచుగా సినీ వేడుకల్లో భాగస్వామ్యులు అవుతూ తన 150వ సినిమాను ఎప్పుడూ లైం లైట్ లో ఉంచుకోవడంలో మెగాస్టార్ పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో ఈ తెలుగు ‘కత్తి’పై అందరి కళ్ళు పడ్డాయి.



