అదేదో సామెత చెప్పినట్లు గవర్నర్‌కి పిర్యాదు చేస్తారట!

Jagan demands CBI probe into DSC row

అదేదో సామెత చెప్పినట్లు, గుంటూరులో శాప్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు చేసిన అరాచకాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకొంటుంటే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం గవర్నర్‌ని కలిసి ప్రభుత్వం, పోలీసులపై పిర్యాదు చేయబోతున్నారు.

తమ పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా శాప్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసనలు తెలుపుతుంటే, సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ ఇద్దరూ గూండాలను దింపి తమ కార్యకర్తలపై దాడులు చేయించారని పిర్యాదు చేస్తారట!

ADVERTISEMENT

తాము డీఎస్సీలో అవకతవకలపై ఆందోళనలు చేస్తూ సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతుండటంతో వారిద్దరూ ఆందోళన చెందుతున్నారని, తీవ్ర అభద్రతాభావంతో వారు ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని గవర్నర్‌కు జగన్‌ పిర్యాదు చేయబోతున్నారట.

టీడీపి గూండాలు తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుంటే, వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు వారికే సహకరించారట. కనుక ఈ భౌతిక దాడులను తీవ్రంగా పరిగణించిన జగన్మోహన్ రెడ్డి, గవర్నర్‌ని కలిసి పిర్యాదు చేస్తారు. అలాగే డీఎస్సీ అవకతకలపై సీబీఐ చేత విచారణకు ఆదేశించాలని కోరబోతున్నారట!

అబద్దాన్ని నిజమని వాదించడమే కాకుండా, దానిని నిజమని నిరూపించేందుకు గవర్నర్‌ని కలవడం, తిరిగి ప్రభుత్వం, పోలీసులపైనే పిర్యాదులు చేయబోతుండటం జగన్‌ మార్క్ రాజకీయాలే అని చెప్పక తప్పదు.

సీబీఐ విచారణ కావాలంటే నేరుగా సీబీఐనే ఆశ్రయించవచ్చు లేదా ప్రధాని మోడీ లేదా అమిత్ షాలను కలిసి కోరవచ్చు. ఒకవేళ ఈ రెండూ సాధ్యం కావనుకుంటే హైకోర్టులో పిటిషన్‌ వేసి కోరవచ్చు.

అదీ సాధ్యం కాదనుకుంటే, ఎలాగూ వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి రాబోతున్నామని చెప్పుకుంటున్నారు. కనుక అప్పుడే సీబీఐ విచారణ కోరవచ్చు.

ఒకవేళ తమ ఆరోపణలు నిజమే అయితే నకిలీ సర్టిఫికేట్లతో జేరినవారిని, లంచాలు ఇచ్చి చేరినవారిని ఉద్యోగాలలో నుంచి సస్పెండ్ చేసి విచారణ జరిపించవచ్చు. నేరం రుజువైతే వారిని ఉద్యోగాలలో నుంచి తొలగించి వారిపై చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవచ్చు.

జగన్‌ ఎదుట ఇన్ని ఆప్షన్స్ ఉండగా, పార్టీ శ్రేణుల ఆందోళనల పేరుతో రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చేయిస్తున్నారు. అధినేత కళ్ళలో ఆనందం కోసం అత్యుత్సాహం ప్రదర్శించిన వారందరూ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. కనుక వీటికీ వైసీపీ కార్యకర్తలే బలవుతారు తప్ప ప్యాలస్‌లో ఉండే జగన్మోహన్ రెడ్డి కాదని ప్రతీ వైసీపీ కార్యకర్త తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోలేకపోతుంటే కనీసం రోడ్డున పడ్డ వాలంటీర్లని చూసయినా తెలుసుకోవాలి కదా?

ADVERTISEMENT
Latest Stories