ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి – కలెక్షన్ కింగ్ మోహన్ బాబులు కలిసారంటే… ఏం జరుగుతుందో అన్న ఆసక్తి అటు సినీ జనాల్లో, ఇటు వీక్షకులలో వ్యక్తమవ్వడం సహజమే. అలాంటి అరుదైన కలయికకు విశాఖ వేదిక అయ్యింది. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుబ్బిరామిరెడ్డి విశాఖలో ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో టాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చి, మోహన్ బాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిధులు ‘కలెక్షన్ కింగ్’పై తమదైన శైలిలో ప్రసంగించారు.
“ఈ ఫంక్షన్ కు రావాలని మోహన్ బాబు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని, ఆ వెంటనే తాను అంగీకరించానని” మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘ఇంతకు ముందు నా డేట్స్ నా వద్దే ఉండేవి. కానీ ఇప్పుడు షూటింగ్ ఉండటంతో ఏం చేసినా ముందే ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి నేడు షూటింగ్ ఉంది. ఇక్కడికి రాకపోతే, ఓ రాక్షసుడితో గొడవైపోతుంది, షూటింగ్ క్యాన్సిల్ చేయండి’ అని యూనిట్ సభ్యులకు చెప్పానని, మోహన్ బాబు చూపే ప్రేమ రాక్షస ప్రేమని, దాని వెనుక ఎంతో వాత్సల్యం దాగుంటుందని సరదా వ్యాఖ్యలు చేసి తనదైన రీతిలో ఆకట్టుకున్నారు మెగాస్టార్.
“40 ఏళ్ల సినీ ప్రస్థానంలో మోహన్ బాబు ఎంతో మంది ప్రేమాభిమానాలు సంపాదించుకున్నారని, ఎందరో ఆప్తులు, మరెందరో మిత్రులను, మరెంతో మంది అభిమానుల ఆదరణను సొంతం చేసుకున్నారని, ఇంతకంటే ఒక నటుడుకి కావాల్సింది ఏముంటుందని” విక్టరీ వెంకటేష్ అన్నారు. మరింత కాలం ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని, ఆయనను సత్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు విక్టరీ. ‘బయటకు మోహన్ బాబు ఎలా కనిపించినా ఆయన చాలా మంచి మనిషి, గడచిన 40 ఏళ్లు మాత్రమే కాదు, మరో 40 ఏళ్ల పాటు ఆయన ఇలాగే ఆనందంగా ఉండాలని’’ ఆకాంక్షించారు వెంకీ సోదరుడు నిర్మాత సురేష్ బాబు.
“ఈ వేళ వస్తున్న నటులు రెండు, మూడేళ్ల కాలానికే కెరీర్ ముగించుకుంటుంటే… మోహన్ బాబు 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఆదర్శనీయమని, ‘కేటుగాడు’ సినిమాతో హీరో అయ్యాడని, అలా ఎదగాలంటే క్రమశిక్షణ, ప్రతిభ, నిబద్ధత కలిగి ఉండాలని, అవన్నీ ఉండడం వల్లే మోహన్ బాబు విలన్ గా, నటుడిగా, హీరోగా రాణించాడని” దర్శకరత్న దాసరి ప్రశంసలు కురిపించారు. మోహన్ బాబు సినీ పరిశ్రమలో ఇన్స్ స్టిట్యూట్ లాంటి వ్యక్తి అని, మోహన్ బాబు విద్యాసంస్థను పెట్టి విజయవంతంగా నడుపుతున్నాడని, క్యాస్ట్ (కులం) కాలమ్ తీసేసిన ఒకే ఒక విద్యాసంస్థ మోహన్ బాబు నెలకొల్పిన సంస్థ అని, విలువలు వ్యక్తిత్వంగా చేసుకుని దిగ్గజంగా ఉన్నాడంటే అది గొప్ప విషయమని అన్నారు దర్శకరత్న.
“ఒక వ్యక్తి గొప్ప ఒక స్థాయికి చేరుకోవడానికి చాలా కారణాలుంటాయని, అలాగే మోహన్ బాబు కూడా ఉన్నత స్థానానికి చేరడంలో చాలా విశేషాలు ఉన్నాయని, తెలుగు సినీ హీరోలు గుర్తించాల్సిన విషయం ఏంటంటే… తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబు అందరూ హీరోలు చేసిన పాత్రలతో పాటు, సినిమాల్లో ఉండే అన్నిరకాల వేషాలు వేసి మెప్పించాడని, అయితే ఇప్పటివరకు వచ్చిన హీరోలెవరూ మోహన్ బాబు వేసిన పాత్రలు పోషించలేరని, సినీ నటులకు సవాల్ విసిరేంత గొప్ప మనిషి మోహన్ బాబు అని” లెజండరీ దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు.
‘‘నీ అంత అందగత్తెను నేను ఇంతవరకు చూళ్లేదమ్మాయ్ అని మోహన్ బాబు అంటూ ఉంటారని, అది నిజమో కాదో తనకు తెలియదు కానీ, ఆయనతో పాటు తామంతా నటించామంటే గర్వంగా ఉంటుందని, ఈ సత్కారాన్ని కనులారా వీక్షించేందుకు ఉదయ్ పూర్ నుంచి వైజాగ్ వచ్చి మంచి అనుభూతిని మూటగట్టుకున్నానని” జయప్రద చెప్పగా, “నువ్వు డైలాగులు సరిగ్గా చెప్పడం లేదమ్మాయ్ అని మోహన్ బాబు అనేవారని, తామిద్దరం కలిసి గొప్ప సినిమాల్లో నటించడం ఎంతో ఆనందంగా ఉందని, తొలినాళ్ల నుంచి నేటి వరకు అదే గొంతుతో ఉండడం ఎంతో అభినందనీయమని” జయసుధ చెప్పుకొచ్చారు.



