మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం ఆచార్య మే 13 న విడుదల కావాల్సి ఉంది, కాని కరోనావైరస్ కేసులు అనూహ్యంగా పెరగడం వల్ల సినిమా విడుదల నిరవధికంగా వాయిదా పడింది. ఇటీవలి షెడ్యూల్‌లో పాల్గొన్న నటుడు సోను సూద్ కరోనా పాజిటివ్ గా తేలడంతో చిత్ర బృందం మొత్తం ఐసొలేషన్ కు వెళ్ళకతప్పని పరిస్థితి.
సినిమా వాయిదా పడటం ఎలాగూ తప్పదు కనుక చిరంజీవి కొన్ని వారాల పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నారని సమాచారం. పరిస్థితులు మారి షూట్ పూర్తి చేయడానికి అనుకూలంగా కనిపిస్తే మే నెలలో మాత్రమే ఆచార్య చివరి షెడ్యూల్ ప్రారంభిస్తారు. సినిమా విడుదలకు అనుకూల పరిస్థితులు కనుచూపుమేరలో లేకపోవడంతో షూటింగ్ కు తొందరపడవలసిన అవసరం లేదు మెగాస్టార్ అభిప్రాయమట
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య లో రామ్ చరణ్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. మెగాస్టార్‌తో పాటు కాజల్ అగర్వాల్ కనిపించనుండగా, రామ్ చరణ్ పూజా హెగ్డేతో రొమాన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం కంపోజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఆయన చిరంజీవికి అనేక సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు.
చిత్రంలోని మొదటి పాట ఇటీవలే విడుదలై సినిమా లోని పాటల మీద అంచనాలు భారీగా పెంచేసింది. చిరంజీవి మరియు చరణ్ ఈ చిత్రంలో నక్సల్స్ పాత్రలో నటించారు. నక్సలిజం ను పెంచి పోషిస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో ఆ మధ్య పెద్ద వివాదమే చెలరేగింది.





