రాజకీయాల్లో చిరంజీవి అనే పేరు సినీ పరిభాషలో చెప్పాలంటే… ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా..! అయితే ఇది గతం. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? చిరంజీవి రాజకీయ నాయకుడిగా భవిష్యత్తు ఏమిటి? అని ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సినిమాల్లోకి ఎలా అయితే రీ ఎంట్రీ ఇచ్చారో, భవిష్యత్తులో రాజకీయాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి చిరంజీవి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఓ వైపు ‘జనసేన’ అధినేత చిరంజీవిపై ఉన్న మచ్చలను తొలగించే విధంగా రెండు నాల్కల ధోరణి అవలంభిస్తూ ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మెగాస్టార్ కూడా గతంలో తాను డిఫెన్స్ లో పడిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి, విమర్శలకు బదులిచ్చే కార్యక్రమాలను సైలెంట్ గా చేస్తుండడం విశేషం.
‘ప్రజారాజ్యం’ స్థాపించిన తొలినాళ్ళల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిపై ఎక్కుపెట్టిన అస్త్రం ఏమిటో అందరికీ తెలిసిందే. “పుట్టిన ఊరుకే ఏమీ చేయని చిరంజీవి, రాష్ట్రానికి ఏం చేస్తారు అంటూ” చేసిన ఎదురుదాడి బాగా వర్కౌట్ అయ్యింది. అందులో వాస్తవం ఉండడంతో ప్రజల్లోకి బలంగా కూడా వెళ్ళింది, చివరికి చిరంజీవి పొలిటికల్ కెరీర్ అపహాస్యం పాలైంది. తర్వాత కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ చిరంజీవి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేవీ పెద్దగా లేకపోవడంతో, ఒక రాజకీయ నాయకుడిగా చిరును అందరూ బాగా లైట్ గా తీసుకున్నారు. అదీ గాక రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్ కు నాడు చిరు వెన్నుదన్నుగా ఉండడం ప్రజల ఆగ్రహాన్ని చవిచూసేలా చేసింది. అయితే ప్రస్తుతం వీటన్నింటిని ప్రజలు మరిచిపోయారు అన్నది కూడా వాస్తవం.
ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్న మెగాస్టార్ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే వందకు వంద శాతం అన్న టాక్ అయితే స్పష్టంగా వినపడుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ విమర్శలితే చేసి చిరును డిఫెన్స్ లో పడేసారో, భవిష్యత్తులో అలాంటివి తలెత్తకుండా… తాను పుట్టిన ఊరు అయిన పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని సుందరవనంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఆ గ్రామ ప్రజలంతా చిరంజీవి రాక కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొందంటే, స్థానికంగా ప్రజలను ఎంతటి సంతృప్తిపరులను చేసారో అర్ధం చేసుకోవచ్చు. దాదాపుగా 5 కోట్ల ఎంపీ నిధులతో పేరుపాలెంలో మౌలిక వసతులను కల్పించిన చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తడం గ్రామస్తుల వంతవుతోంది.
అయితే ఇదంతా మెగాస్టార్ చిరంజీవి “సెకండ్ ఇన్నింగ్స్”కు బ్యాక్ గ్రౌండ్ వర్క్ లా కనపడుతోందని సినీ, పొలిటికల్ వర్గాల టాక్. గతంలో వచ్చిన విమర్శలకు బదులివ్వడం చిరు వంతవుతుంటే… చిరంజీవిని వెనుకేసుకోస్తూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే… ఖచ్చితంగా మెగాస్టార్ – పవర్ స్టార్ ల కలయిక భవిష్యత్తులో ఉండబోతోందని చెప్పవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే… చిరంజీవిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టే మహత్తర బాధ్యతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లుగా సంకేతాలు కనపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ తో సూపర్ సక్సెస్ అయిన చిరంజీవి, రాజకీయాల్లో కూడా ‘సెకండ్ ఇన్నింగ్స్’తో విజయబావుట ఎగురవేస్తారేమో చూడాలి.



