బటన్ నొక్కుడు సభలు అలా… బయట ఇలా… ఎందబ్బా ఇది?

YS Jagan Anantapur Meeting“రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ మేలు చేశాను… కనుక వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మావే…” అని గొప్పగా చెప్పుకొంటున్న సిఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి సంక్షేమ పధకాలకు నిధులు విడుదల చేస్తున్నా జనాలు స్వచ్ఛందంగా రావడం లేదు! నీళ్ళు, విద్యుత్ సరఫరా నిలివేసి, సంక్షేమ పధకాలు నిలిపివేస్తామని బెదిరించి బలవంతంగా జనాలను సభలకు రప్పించాల్సివస్తోంది! వారి చేతుల్లో బలవంతంగా ‘థాంక్యూ సిఎం సార్… అనో లేదా నువ్వే మా నమ్మకం జగన్‌ అనో మరొక ప్లకార్డులో పెట్టి సభలో కూర్చోబెట్టాల్సి వస్తోంది.

వారందరూ స్వచ్ఛందంగానే తరలి రాలేదని తెలిసినా జగనన్న ఉద్రేకంగా ప్రసంగించేస్తుంటారు. ఆయన తమను ఉద్దేశ్యించి మాట్లాడుతుండగానే జనాలు మద్యలో లేచి వెళ్ళిపోతున్నారు. వారు సిఎం సభ మద్యలో వెళ్ళిపోతే తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయో అనే భయంతో అధికారులు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, వాలంటీర్లను, పోలీసులను కాపలా పెట్టినా జనాలు గోడలు దూకి వెళ్ళిపోతునే ఉన్నారు!!!

ADVERTISEMENT

ఎవరైనా తేరగా డబ్బులు వస్తాయంటే స్వచ్ఛందంగా తరలివస్తారు. కానీ ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలకు బలవంతంగా జనాలను తీసుకురావలసి వస్తోంది… ఎందుకు?

జగనన్న ఈ బటన్ నొక్కుడు సభలకి వస్తున్నప్పుడు ఆ ఊర్లో దారిపొడవునా పరదాలు కట్టే కొత్త ఆనవాయితీ కొనసాగుతోంది. జనం తనని చూడకూడదనుకొన్నప్పుడు జనం మద్యలోకి రావడం ఎందుకు?పరదాలు కట్టుకోవడం ఎందుకు?ఊరంతా పరదాలు కట్టే బదులు తన కారుకే ఓ పరదా కట్టుకొంటే సరిపోతుంది కదా?అని సోషల్ మీడియాలో సన్నాయినొక్కుళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి.

సరే… ఈసారి పరదాలు లేకుండా ‘ట్రయల్ రన్’ వేద్దామనుకొన్నారో ఏమో మొన్న అనంతపురం బటన్ నొక్కుడు కార్యక్రమంలో ‘ఒంటరి సింహం’ పంచతంత్రం కధ వినిపించి తోడేళ్ళ గుంపుపై గొంతు చించుకొని గర్జించిన తర్వాత, ఓ డజను వాహనాల కాన్వాయ్‌ మద్యలో తిరిగి వెళుతుండగా దారిలో కొందరు గ్రామస్తులు వాటికి అడ్డుపడి నిరసనలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ మేలు చేశాననుకొంటున్న జగనన్నకు ఇది దిగ్బ్రాంతి కలిగించే విషయమే. వెంటనే కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బంది వారిని పక్కకు నెట్టేయగా జగనన్న వాహనం రయ్యిమని దూసుకుపోయింది.

అదే… ఆయన కారులో నుంచి దిగి వారి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తానని చెప్పి, ఆ తర్వాత పరిష్కరించకపోయినా జగనన్న భజన చేసే మంత్రులు, ఎమ్మెల్యేలకు దీని గురించి గొప్పగా భజన చేసేందుకు గొప్ప అవకాశం కలిగి ఉండేది. పనిలో పనిగా సొంత మీడియాలో, సోషల్ మీడియాలో దీని గురించి గొప్పగా వర్ణించి వ్రాసుకొనేందుకు అవకాశం లభించి ఉండేది. కానీ గోల్డన్ ఛాన్స్ మిస్ చేసుకొన్నారు.

ఇలాంటి ఇబ్బందులు వద్దనే జగనన్న పరదాలు కట్టించుకొంటున్నారు… ఇది అర్దం చేసుకోలేని జనాలు, ప్రతిపక్షాలు అనవసరంగా పాపం ఆయన మీద అనవసరంగా నోరు పారేసుకొంటున్నారు కదా!

ADVERTISEMENT
Latest Stories