ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కులాల అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత కొన్ని దశాబ్దాల నుండి రెండు సామజిక వర్గాల పాలనలోనే కొనసాగుతూ వస్తుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రులు గా పదవి బాధ్యతలు చేపట్టిన రెడ్డి సామాజికవర్గం నేతలు కానీ, కమ్మ సామజిక వర్గం నాయకులు కానీ ప్రత్యక్షంగా ఒక కులాన్ని కించపరచడం కానీ, ఒక కులాన్ని అణిచివేయాలని కానీ చూసిన దాఖలాలు లేవు.
కానీ 2019 ఎన్నికలలో 151 సీట్లతో విజయం సాధించిన వైసీపీ పార్టీ మొట్టమొదటి సారిగా ఒక సామజిక వర్గం పై కక్ష సాధింపు ధోరణితో అణిచివేస్తూ, మరో సామజిక వర్గాన్ని కించపరుస్తూ తన ఐదేళ్ల పాలన కొనసాగించింది. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే ఏపీ రాజధాని అమరావతిని ఒక కులానికి ఆపాదిస్తూ ‘కమ్మ’రావతిగా మార్చేసి రాష్ట్ర భవిష్యత్తు తో పాటు అక్కడి ప్రాంత రైతుల జీవితాలను రోడ్డు మీదకు లాగేసారు.
అయితే దీనికంతటికి కారణం ఆయనకు చంద్రబాబు నాయుడు మీద ద్వేషం, టీడీపీ పార్టీ మీద ఉన్న కక్ష మాత్రమే. ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషంతో ఒక రాష్ట్ర భవిష్యత్తుని తలక్రిందులు చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు జగన్. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉంటూ ముఖ్యమంత్రి పీఠాన్ని నిర్దేశించేంత ప్రభావితం చేయగలిగిన వర్గం కాపు సామజిక వర్గం.
అయితే ఈసారి రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికలలో కాపులు పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రానికి పట్టిన వైసీపీ అనే విపత్తును తరిమి కొట్టడానికి టీడీపీ తో కలిసి నడుద్దాం అంటూ పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే 2014 ఎన్నికలలో కూడా టీడీపీ, బీజేపీ కి పవన్ మద్దతు తెలియ చేయడంతో జగన్ ఓటమి ముందు తలవంచక తప్పలేదు. అయితే ఇప్పుడు 2024 లో కూడా అదే కూటమిని ఏర్పాటు చేయడంలో పెద్దన్న పాత్ర పోషించి మూడు పార్టీల పొత్తును ముందుకు తీసుకువచ్చారు పవన్.
అయితే మూడు పార్టీల పొత్తు ప్రకటనతోనే సగం ఓటమిని ఒప్పుకున్న వైసీపీ కుల రాజకీయాలకు తెర లేపింది. చంద్రబాబు ను ముఖ్యమంత్రిని చేయడానికే పవన్ పని చేస్తున్నాడు. కాపు ఓటర్లను బాబు కాళ్ళ కింద తాకట్టుపొట్టడానికి పవన్ సిద్ధమయ్యారు. గంప గుత్తగా పవన్ తన సామజిక వర్గం ఓట్లను టీడీపీ పార్టీకి అమ్మడానికి ప్రణాళికలు వేస్తున్నారు అంటూ వైసీపీ కాపు నాయకులు మొదలు ముఖ్యమంత్రి జగన్ వరకు కాపు కులాన్ని ఒక ‘అంగడి’ వస్తువులా మార్చేశారు.
‘ఒకరు కొనుక్కోవడానికి, మరొకరు అమ్ముకోవడానికి కులం అనేది దుకాణాలలో దొరికే మందు బాటిల్ కాదుగా’. అన్ని కులాలలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎలా అయితే ఉంటారో ఓటర్లు కూడా అలాగే ఉంటారు. 2019 ఎన్నికలలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలో వైసీపీ పార్టీకి ఎక్కువ సీట్లు దక్కాయి. అప్పుడు కాపు సామజిక వర్గాన్ని రెడ్డి నాయకత్వానికి తాకట్టు పెట్టినట్టా..? వైసీపీ పార్టీకి మద్దతుగా ఉంటే కాపు సామజిక వర్గం బలమైనది. అదే టీడీపీ కి అనుకూలంగా ఓటేస్తే కమ్మ వారికి అమ్ముడు పోయినట్టా..?
నిజంగా జగన్ కు కాపుల మీద అంత ప్రేమే ఉంటే తన ఐదేళ్ల పాలనలో కాపు సమాజానికి వైసీపీ చేసిందేమిటో చెప్పగలరా..? మీడియా ముందుకొచ్చి పవన్ ను వ్యక్తిగతంగా దూషించడానికి, నువ్వు కాపు నా…వే. నేను కాపు నా..నే అంటూ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడానికి వైసీపీలో ఉన్న కాపు నాయకులను వాడుకున్నారు. నా కులం కాపు, నేను జగన్ దగ్గర పెద్ద పాలేరు లాంటి వాడిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా అంటూ ఒక మంత్రి తన కులాన్ని పాలేరుగా మార్చేశారు.
అలాగే కాపులు తాగుబోతులు, మాంసం ఎక్కువ తింటారు అంటూ సమాజంలో తన కులాన్ని తానే కించపరిచేలా మరో మంత్రి, పవన్ ను ఓడించక పొతే నా పేరు చివర రెడ్డి అనే రెండు అక్షరాలు చేర్చుకుంటా అంటూ ఒక కుల పెద్ద, కాపు కార్డు తో మంత్రి అయ్యి కోడికి, గుడ్డుకి తేడా తెలియక ఆ సామజిక వర్గం పరువు తీసిన మరో వైసీపీ మంత్రి. ఇలా కులాల్ని అడ్డుపెట్టుకుని పదవులు పొంది దాన్ని మళ్ళీ అదే కులాన్ని కించపరచడానికి వాడుకున్న ఈ కుల ప్రేమికులు ఒక్క వైసీపీ లో దర్శనమిస్తారు.
అయితే పవన్ ఒకరి దగ్గర పాలేరుగా బతకమని కానీ, ఒకరి కింద బానిసలుగా సేవ చేయమని కానీ, ఒకరి పల్లకి మోయడానికి కానీ కాపులను పెద్దన్న పాత్ర పోషించమని చెప్పలేదు. రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ కి వెనుకకాని, టీడీపీ కి ముందు కానీ కాదు టీడీపీ ‘తో’ కలిసి నడుద్దాం అని పిలుపునిచ్చారు. కలిసి నడిచే దగ్గర ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావన ఉండదు. ఇలా ఒక్క మాటతో 2024 ఎన్నికలలో రెండు భిన్న ధ్రువాలను కలిపి నడిపించారు పవన్, బాబు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము కలిసి తమ రెండు సామజిక వర్గాలని కలిపిన నాయకులు ఒక పక్క ఉంటే కేవలం తన స్వార్థం కోసం, తమ రాజకీయ పదవులు కోసం వంగవీటి పేరు అడ్డుపెట్టుకుని కొన్నాళ్ళు ముద్రగడ పేరు చెప్పి మరికొన్నాళ్లు రెండు కులాలను విడతీయడానికి చూసిన వ్యక్తి రాష్ట్ర నాయకుడవుతాడా..? అయితే అధికారంలో ఉన్న ఈ ఐదేళ్ళు జగన్ కు కవచంలా తమను, తమ కులాన్ని అడ్డుపెట్టి కాపు కాస్తున్న ఈ వైసీపీ కాపు నేతలే ఇప్పుడు కూడా జగన్ ను మరోసారి కాపు కాయడానికి మీడియా ముందుకు రావడం నిజంగా జగన్ కాపు కులం నాయకులను తన పార్టీలో ఎందుకు పెట్టుకున్నారో అనేదానికి సాక్ష్యంగా నిలిచింది.
వైసీపీ అధికారంలో ఉన్న అన్ని రోజులు పెత్తనమంతా ఆయన సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు చేతిలోనే ఉంచుతూ ప్రజల ముందు మాత్రం పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, ముద్రగడ పద్మనాభమం వంటి కాపు నేతలను దోషిగా చూపించడం చూస్తే ఆయనకు కాపు అంటే ప్రేమా..? పగా..? అనేది స్పష్టమవుతుంది. పదవులు అనుభవించి పెత్తనం చేసిన వర్గాలు తెర వెనుక ఉంటే ప్రజల మధ్య దోషులుగా మిగలడానికి తెర ముందు కొస్తున్నారు కాపు నేతలు. వై..? జగన్ కోసం ప్రజల ద్వేషాన్ని భరించడానికి ఆ వర్గం నేతలు సిద్ధంగా లేరా..?






