
తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లో ప్రాంతీయవాదిని మరోసారి బయటకు తెస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు పనేమిటని ప్రశ్నిస్తున్నారు. అవి అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికే వస్తున్నాయని వాదిస్తున్నారు. వాటి ముసుగులో ఆంధ్రా పార్టీలు, వాటి నేతలు తెలంగాణపై మళ్ళీ పెత్తనం చేయాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కేసీఆర్ వాదిస్తున్నారు.
జాతీరాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్న కేసీఆర్ నేటికీ ఈవిదంగా ప్రాంతీయవాదిగానే వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. జాతీయస్పూర్తి కలిగి ఉండాలని అందరికీ సుద్ధులు చెప్పే కేసీఆర్, తెలంగాణలో మాత్రం తెలంగాణ సెంటిమెంట్ సజీవంగా ఉండేలా జాగ్రత్తపడుతుంటారు. ప్రతీ ఎన్నికల సమయంలో దానిని బయటకు తీసి ఉపయోగించుకొంటుంటారు. ఇప్పుడు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కూడా అదే చేస్తున్నారు.
అంటే కేసీఆర్ జాతీయవాదం, జాతీయస్పూర్తి పొరుగు రాష్ట్రాలలో ప్రజలకు, ప్రతిపక్షాలకు సుద్దులు చెప్పేందుకే తప్ప సొంత రాష్ట్రానికి వర్తించవన్న మాట! ఈ విధానంతోనే ఆయన మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నారు. రేపు ఆంధ్రాలో కూడా చేయవచ్చు.
అయితే ఆయన చేసిన ఓ పొరపాటు ఏమిటంటే తాను ప్రధాన మంత్రిని అవ్వడమే తన జాతీయ రాజకీయ లక్ష్యమని తన పార్టీ నేతల చేత చాటింపు వేయించుకోవడమే. తద్వారా ఈ జాతీయవాదం, జాతీయ స్పూర్తి అన్ని కాకమ్మ కధలే అని స్వయంగా బయటపెట్టుకొన్నట్లయింది.
ఈ ప్రాంతీయవాదం, జాతీయవాదంపై తన ద్వంద వైఖరిని ప్రజలు, ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తున్నారనే సంగతి కేసీఆర్‌కు బాగా తెలుసు. ఒక్కటిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టిన కేసీఆర్, రేపు ఏపీని ఉద్ధరిస్తానని వస్తే ఆంధ్రా ప్రజలు నమ్మరని కూడా ఆయనకు బాగా తెలుసు. బహుశః అందుకే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో తన పార్టీని విస్తరించడానికి వెనకడుగువేస్తున్నారనుకోవచ్చు.
ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ జాతీయ నాయకుడుగా ఎదగాలనుకొంటే ముందుగా ఆయనే జాతీయవాదిగా మారాల్సిన అవసరం ఉంది. కేవలం టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ పార్టీగా మార్చేసుకొన్నంత మాత్రన్న జాతీయవాది అయిపోరు కదా?