తెలంగాణలో ఇప్పటివరకు ఓ లెక్క… ఇక నుంచి మరో లెక్క… అన్నట్లు నేటి నుంచి కాంగ్రెస్ మార్క్ పాలన మొదలైంది. ముందుగా కేసీఆర్ ముచ్చటపడి నిర్మించుకొన్న ప్రగతి భవన్ పేరుని జ్యోతీరావు ఫూలే ప్రజాభవన్‌గా మార్చుతున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ప్రజాభవన్ చుట్టూ నిర్మించిన బారీ ఇనుప గ్రిల్స్, బారికేడ్లను తొలగింపజేయించారు. ఇదివరకు బిఆర్ఎస్ సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా లోనికి అనుమతి లభించేది కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసేందుకు సాధ్యపడేది కాదు.
కానీ ఇకపై ప్రజాభవన్‌లోకి మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు సామాన్య ప్రజలకు సైతం ప్రవేశించడానికి అనుమతిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతీ శుక్రవారం ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలని పరిష్కరించేందుకు కృషి చేస్తానని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అలాగే కేసీఆర్ ఎంతో ముచ్చటపడి వందల కోట్ల ప్రజాధనంతో కట్టించుకొన్న సచివాలయంలోకి కూడా ప్రతిపక్ష నేతలను, ఎమ్మెల్యేలను అనుమతించేవారు కారు. పిసిసి అధ్యక్షుడు, ఎంపీ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సచివాలయంలో మంత్రులను కలిసేందుకు వస్తే వారికి అనుమతి లేదంటూ గేటు వద్దే పోలీసులతో అడ్డుకొని వెనక్కు తిప్పి పంపించేయడం అందరూ చూశారు.
కేసీఆర్ ముచ్చటపడి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకొన్న ముఖ్యమంత్రి ఛాంబర్‌లో ఆయన కూర్చోన్న కుర్చీలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చోబోతున్నారు. ఆయనతో బాటు సీతక్క తదితర మంత్రులు తమ తమ పోలీస్ కాన్వాయ్‌లతో కొద్ది సేపటి క్రితమే సచివాలయానికి వెళ్ళగా అక్కడ ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరూ వారికి ఘనస్వాగతం పలికి సాదరంగా తోడ్కొని లోనికి తీసుకువెళ్ళారు. మరికొద్ది సేపటిలో వారందరూ ఇప్పటి వరకు బిఆర్ఎస్ మంత్రులు కూర్చోన్న ఛాంబర్లలో కూర్చొని బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
తర్వాత సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారెంటీ హామీలకు సంబందీంచిన ఫైలుపై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. కనుక తొలి మంత్రివర్గ సమావేశంలో వాటికి చట్టబద్దత కల్పిస్తామనే హామీని నెరవేర్చబోతున్నారు.
కాంగ్రెస్ దూకుడు చూస్తున్న మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈ పరిణామాలను జీర్ణించుకోవడం కొంచెం కష్టమేనేమో?




