రేవంత్‌ రెడ్డి కేటీఆర్‌ని విమర్శిస్తే మనకి గుచ్చుకొంటోందేమిటో?

“తెలంగాణ ఎన్నికలలో ఎవరు గెలిస్తే మాకేమిటి… ఎవరు ముఖ్యమంత్రి అయితే మాకెందుకు?” అని మంత్రి అంబటి రాంబాబు చెప్పిన వారం రోజులకే కేసీఆర్‌ చేసిన పొరపాటు మనం చేయకూడదనుకొంటూ జగన్మోహన్‌ రెడ్డి వైసీపి ఎమ్మెల్యేలను, నియోజకవర్గం ఇన్‌చార్జిలను మార్చడం మొదలుపెట్టేశారు. దీంతో తెలంగాణ కేంద్రంగా మొదలైన భూకంపం ఏపీ వైసీపిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అంటే ఏపీ, తెలంగాణ రాజకీయాల మద్య ఎక్కడో కంటికి కనిపించని లింక్ ఉందన్న మాట!

ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశంలో తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దానిలో కేటీఆర్‌ని ఉద్దేశ్యించి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వింటుంటే, వైసీపి భుజాలు తడుముకోవలసిన పరిస్థితి కనిపిస్తోంది.

ADVERTISEMENT

ఇంతకీ రేవంత్‌ రెడ్డి ఏమన్నారంటే, “కొందరు ఎన్ఆర్ఐ నాయకులకి ప్రజాస్వామ్యం విలువ, స్పూర్తి అర్దం కావు. ప్రజాస్వామ్యంలో 49 శాతం ఓటింగ్ శాతానికి సున్నా విలువ ఉంటుంది. అదే 51 శాతానికి 100 శాతం విలువ ఉంటుంది.

కేటీఆర్‌కి ఇంత చిన్న విషయం అర్దం కానందునే బిఆర్ఎస్ కంటే కేవలం 1.85 శాతం అధికంగా ఓట్లు సాధించి మేము అధికారంలో వచ్చామని ఎద్దేవా చేస్తున్నారు. కానీ ఆ 1.85 శాతం తేడానే మిమ్మల్ని అక్కడ ప్రతిపక్ష బెంచీలలో, మమ్మల్ని ఇక్కడ అధికార బెంచీలలో కూర్చోబెట్టింది కదా? కనుక ప్రజల తీర్పుని గౌరవించి హుందాగా మాట్లాడితే బాగుంటుంది,” అని చురకలు వేశారు.

తెలంగాణ శాసనసభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా వచ్చింది. ఆనాడు ఆయన దయతలిస్తేనే కేసీఆర్‌ ఎమ్మెల్యే అయ్యారని రేవంత్‌ రెడ్డి అన్నారు.

ఇంకా ఏమన్నారంటే, “కేసీఆర్‌ని కాంగ్రెస్ పార్టీయే రెండుసార్లు కేంద్రమంత్రిని చేసింది. చీమల పెట్టిన పుట్టలో పాము దూరిన్నట్లు కెకె మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తే దానిలోకి ఎన్‌ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్‌ కోటాలో మీరు ప్రవేశించి ఆ పుట్టని ఆక్రమించేశారు. మొదట ఎమ్మెల్యే తర్వాత మంత్రి పదవులు కూడా పొందారు. కానీ మీ వలన మహేందర్ రెడ్డి అన్యాయం అయిపోయారు.

ఇవన్నీ మీకు నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేయనక్కరలేదు. కనుక ఎప్పుడో జరిగిన వాటిని తవ్వితీస్తూ మమ్మల్ని నిందించే బదులు, గత పదేళ్ళుగా మీ ప్రభుత్వం హయాంలో జరిగిన ఆర్ధిక విధ్వంసం గురించి, ఇకపై జరగాల్సిన వాటి గురించి చర్చిస్తే బాగుంటుంది,” అని సిఎం రేవంత్‌ రెడ్డి కేటీఆర్‌కు చురకలు వేశారు.

రేవంత్‌ రెడ్డి కేటీఆర్‌కు చురకలు వేస్తున్నా అవన్నీ ‘మన వైసీపిలకి’ వేస్తున్నట్లే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కేసీఆర్‌ ఏవిదంగా అహంభావంతో విర్రవీగారో ఇక్కడ మనవాళ్లు అలాగే విర్రవీగుతున్నారు. అధికారంలోకి వచ్చి అప్పుడే 5 ఏళ్ళు కావస్తున్నా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చేసింది ఏ ‘గుడ్డూ’ లేకపోయినా, తమ అసమర్ధతకు, వైఫల్యాలకి నేటికీ గత టిడిపి ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఏపీలో తెలంగాణ కంటే పదిరెట్లు ఎక్కువగా ఆర్ధిక విధ్వంసం జరుగుతూనే ఉంది.

కేసీఆర్‌ లాగే ప్రజాస్వామ్యస్పూర్తిని తుంగలో తొక్కుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను రాజకీయంగా వేధిస్తూనే ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో తెలంగాణ ఎన్నికలు నిరూపించి చూపాయి. తెలంగాణలో జరిగిన తప్పులే ఏపీలో జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కూడా తప్పకుండా కాపాడుతుంది.

ADVERTISEMENT
Latest Stories