నిన్న మొన్నటి వరకు బటన్ నొక్కుడు, సిద్ధం సభల్లో అయితేనేమి… ఇప్పుడు మేమందరం సిద్ధం సభలలో అయితేనేమి… ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్పే మాట ఒకటే ప్రజలకు మేలు చేశాం. చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారు.
నేడు మంగళగిరి సభలో కూడా మళ్ళీ ఇదే పాత పాట పాడారు. ఆ మేలు విలువ ఎంతో రూపాయలలో చెప్పి అది పొందినందుకు అందరూ వైసీపినే గెలిపించాలని కోరారు. గెలిపిస్తే ఇంకా మేలు చేస్తానని, నాకంటే ఎక్కువ మేలు చేస్తానని చెపుతున్న చంద్రబాబు నాయుడు మాటలు నమ్మవద్దని జగన్ హితవు పలికారు.
జగన్ చేస్తున్న ఈ మేలు చాలా ఖరీదైనదని ఇప్పటికే అందరికీ అర్దమైంది. ఆ మేలు కోసం చేసిన అప్పులు, ఆ అప్పులకు చెల్లించాల్సిన వడ్డీల భారం మేలు పొందినవారితో సహా రాష్ట్రంలో ప్రజలందరిపైనే పడుతోంది. ఆ భారం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. కనుక ఇంకా మేలు కావాలో వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలి.
ఈ మేలు సంగతి కాసేపు పక్కన పెట్టి కేవలం మంగళగిరి నియోజకవరాన్ని మాత్రమే ఓసారి చూస్తే, ఇప్పటం గ్రామంలో జనసేన సభ నిర్వహించుకునేందుకు స్థలం ఇచ్చినందుకు, రోడ్డు విస్తరణ పేరిట వారి ఇళ్ళు కూల్చివేయడం, అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి వారందరికీ ఆర్ధికసాయం అందజేయడం బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఇక మంగళగిరిలో చేనేత కుటుంబాలను ఆదుకున్నామని, సెంటు భూములు ఇచ్చామని, నియోజకవర్గం అభివృద్ధికి చాలా కృషి చేశామని జగన్ చెప్పుకున్నారు. మరి అటువంటప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డిని ఎందుకు మార్చాల్సివచ్చింది? ఆయన పార్టీని వీడేటప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధికి జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు కదా?
ఆళ్ళని పక్కన పెట్టి గంజి చిరంజీవిని అభ్యర్ధిగా ప్రకటించి, మళ్ళీ ఆయనను కూడా తప్పించేసి మురుగుడు లావణ్యని ఎందుకు అభ్యర్ధిగా నిలబెట్టారు?అంటే మంగళగిరిలో ఈసారి నారా లోకేష్‌ను ఓడించడం అసంభవమని గ్రహించబట్టే కదా? ఓటమిని ముందే గ్రహించినప్పుడు ఈ మేలైన కబుర్లు దేనికి?
అమరావతిని రాజధాని కాదన్నప్పుడే రాజధాని ప్రాంతాలలో వైసీపి ఓటమి ఖాయం అయిపోయింది. కనుక ఆ ప్రాంతాలలో వైసీపికి ఏదో మేలు జరుగుతుందని ఆశించడం అత్యాసే అవుతుందని గ్రహిస్తే, మిగిలిన ఈ కొద్దిపాటి పుణ్యకాలాన్ని జగన్ అక్కడ వృధా చేసుకోనవసరం ఉండదు.




