ఇప్పుడు జాతీయ, ప్రాంతీయ అనే బేధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచేందుకు ఎడాపెడా హామీలు ఇస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నాయి. చేయకపోతే ప్రతిపక్షాల విమర్శలు తప్పడం లేదు. కనుక అధికారంలోకి వచ్చామనే సంతోషం లేకుండా పోతోంది.
విచిత్రమేమిటంటే వేటితో అవి అధికారంలోకి రాగలిగాయో వాటితోనే అవి అధికారం కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతోంది.
ఉదాహరణకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘మహాలక్ష్మి పధకం’ పేరుతో రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఆ భారం మోయడం ఎంత కష్టమో ప్రభుత్వానికి మెల్లగా అర్దమైంది. కనుక పండగలు, పబ్బాలు, టోల్ ఫీజుల కోసం అంటూ ఛార్జీలు పెంచుకునేందుకు టీజీఎస్ ఆర్టీసీని అనుమతిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ నగరంలో విద్యుత్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్స్ నిర్మించేందుకు రూ. 392 కోట్లు అవసరమంటూ అన్ని రకాల సిటీ బస్సులపై ఛార్జీలు రూ.5 నుంచి 10 వరకు పెంచేసింది.
దీంతో బీఆర్ఎస్ పార్టీ వెంటనే రంగంలో దిగి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది. ఇటీవలే హైదరాబాద్ మెట్రో ఛార్జీలు కూడా పెరిగాయి. ఇప్పుడు సిటీ బస్సుల ఛార్జీలు పెంచేసింది.
సామాన్య ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత కక్ష దేనికి?మహాలక్ష్మి పధకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటూ మరో పక్క ప్రజలను ఈవిదంగా దోచుకోవడం సిగ్గుచేటు,” అంటూ విమర్శలు గుప్పిస్తోంది.
సామాన్య ప్రజల రవాణా సాధనం ఆర్టీసీ బస్సులే. కనుక ఛార్జీలు పెంచినందుకు వారు కూడా ప్రభుత్వంపై తప్పక మండి పడతారు.
త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వరుసగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగబోతున్నాయి.
ఇప్పటికే పలు హామీల అమలుచేయనందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీస్తోంది. ఇప్పుడు ఈ ఛార్జీల పెంపుని మరో అస్త్రంగా ప్రయోగించి కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసే అవకాశం ఉంది.
అంటే ఏ హామీలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకుందో, అవే హామీల కారణంగా నష్టపోబోతోందన్న మాట!




