కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్‌లోనే అత్యధిక సీట్లు… ఏమిటీ సంకేతం?

Congress-Hyderabad

తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని దాదాపు అన్ని సర్వేలు ముక్తకంఠంతో చెప్పేశాయి. వాటిలో చాణక్య స్ట్రేటజీస్ కూడా ఒకటి. దాని నివేదిక ప్రకారం కాంగ్రెస్‌: 67-78, బిఆర్ఎస్‌: 22-31, మజ్లీస్‌: 6-9, బీజేపీ: 6-9 సీట్లు గెలుచుకోబోతున్నాయి.

ADVERTISEMENT

చాణక్య స్ట్రేటజీస్ ఉమ్మడి జిల్లాల వారీగా కూడా ఏ పార్టీకి దాదాపు ఎన్ని సీట్లు వస్తాయో పేర్కొంది. దాని నివేదిక ప్రకారం కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలలోనే అత్యధిక సీట్లు గెలుచుకోబోతోంది. ఈ నాలుగు ప్రాంతాలలోనే ఆంధ్రా ఓటర్లు లక్షల సంఖ్యలో ఉన్నారు.

అక్కడే కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ సీట్లు సాధించబోతుండటం గమనిస్తే, వారందరూ చంద్రబాబు నాయుడు అరెస్టుని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ముగ్గురూ ఖండించకుండా మౌనంగా ఉండిపోయినందుకు ఆగ్రహంగా ఉన్నారని అర్దమవుతోంది.

చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ ఐ‌టి ఉద్యోగులు హైదరాబాద్‌లో, హైటెక్ సిటీ వద్ద ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేసినప్పుడు, వారిని పోలీసులు అడ్డుకోవడం, ఆ తర్వాత కేటీఆర్‌ స్పందిస్తూ, “మీకూ మీకూ ఏవైనా పంచాయితీలు ఉన్నట్లయితే వెళ్ళి ఆంధ్రాలో ధర్నాలు చేసుకోండి కానీ ఇక్కడ చేస్తామంటే కుదరదు,” అంటూ కటువుగా చెప్పడాన్ని గ్రేటర్ పరిధిలో ఆంధ్ర ఓటర్లకు ఆగ్రహం కలిగించిందని, ఈ సర్వే నివేదికని బట్టి అర్దమవుతోంది.

అంతేకాదు… చంద్రబాబు నాయుడుని జగన్‌ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టడంపై కూడా వారు ఈవిదంగా తమ నిరసన, అభ్యంతరం తెలియజేశారని భావించవచ్చు. ఒకవేళ ఈ నివేదిక ప్రకారమే కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ పరిధిలో మెజార్టీ సీట్లు గెలుచుకొన్నట్లయితే, ఏపీలో వైసీపి మేల్కొవలసిందే. ఇకనైనా టిడిపి, జనసేనల పట్ల కక్షపూరిత ధోరణిని విడనాడకపోతే రేపు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వైసీపికి కూడా ఇటువంటి ఫలితాలే రావచ్చు.

ADVERTISEMENT
Latest Stories