కవిత మాట్లాడే సమయం వచ్చింది కానీ…

Telangana Municipal Elections

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో ఊహించినట్లే అధికార కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు దక్కించుకొని ఘన విజయం సాధించబోతోంది. కనుక హైదరాబాద్‌, గాంధీ భవన్‌ వద్ద ఇప్పటికే పార్టీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టేశారు.

అయితే ఈ ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ కూడా గట్టి పోటీయే ఇచ్చి కొన్ని మున్సిపాలిటీలు, 663 వార్డులు దక్కించుకున్నప్పటికీ, కేటీఆర్‌ ప్రగల్భాల స్థాయిలో ఫలితాలు రాలేదు.

ADVERTISEMENT

కనుక పూర్తి ఫలితాలు వెలువడగానే కల్వకుంట్ల కవిత మీడియా ముందుకు వచ్చి కృష్ణార్జునులు (కేటీఆర్‌, హరీష్‌ రావు)లను దుమ్ము దులిపేయడం ఖాయమే.

పోలింగ్ ముందు రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, “వారిరువురూ ఎన్నికల ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఏదో మొక్కుబడిగా కొన్ని ప్రాంతాలలో ప్రచారం చేసి చేతులు దులుపుకున్నారు,” అని ఎద్దేవా చేశారు.

కల్వకుంట్ల కవిత ఇప్పుడు బీఆర్ఎస్‌ పార్టీ;లో లేరు కనుక ఆ పార్టీ గెలుపోటములతో ఆమెకు ఎటువంటి సంబంధమూ లేదు. ఉండదు. కానీ తాను ఇంకా బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నట్లు , దానిని హరీష్ రావు బారి నుంచి తానే కాపాడుకోవాలన్నట్లు ఆమె మాట్లాడుతుంటారు.

ఇప్పుడు బీఆర్ఎస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లే ఉంది కనుక ఆ పార్టీని వీడాలనుకునేవారికి తెలంగాణ జాగృతి తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పడమే ఆమె ఉద్దేశ్యం కావచ్చు. కానీ ఆమె సొంత పార్టీ పెట్టుకొని బీఆర్ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయమని నిరూపించుకునే వరకు ఎవరూ ఆమెతో చేతులు కలిపే అవకాశం ఉండదు.

ఇక్కడ షర్మిల గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏపీలో వైసీపీ నేతలను, కార్యకర్తలను ఆకర్షించి, కాంగ్రెస్‌ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతోనే కాంగ్రెస్‌ అధిష్టానం వైఎస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పజెప్పింది.

కానీ కాంగ్రెస్‌ జాతీయపార్టీ అయినప్పటికీ, వైసీపీ నేతలు ఎవరూ ఆమెతో చేతులు కలిపేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే, ఏపీలో జగన్‌, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ ముగ్గురూ రాజకీయాలు చేస్తున్నంత కాలం కాంగ్రెస్‌కు అవకాశం ఉండదు కనుక!

ఇదేవిధంగా తెలంగాణలో కూడా కేసీఆర్‌, రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్‌ రాజకీయాలలో ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలు ఆమెను పట్టించుకోకపోవచ్చు. ఒకవేళ కేసీఆర్‌ రాజకీయ సన్యాసం తీసుకుంటే ఆయన స్థానాన్ని కేటీఆర్‌, హరీష్‌ రావు భర్తీ చేయలేరు.

అప్పటి వరకు కల్వకుంట్ల కవిత నిలబడగలిగితే చిన్న దారి లభించవచ్చు. ఈ విషయం ఆమె ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. బహుశః అందు వల్లే సొంత కుంపటి పెట్టుకొని చేతులు కాల్చుకునే బదులు, ఏదో విధంగా హరీష్‌ రావుకి పొగ బెట్టి బయటకు పంపించేస్తే బీఆర్ఎస్‌ పార్టీలో చేరిపోవచ్చని కల్వకుంట్ల కవిత ఆలోచన చేస్తున్నారేమో?

ADVERTISEMENT
Latest Stories