గత మూడు దఫాలుగా కేంద్రంలో బీజేపీ వరుసపెట్టి అధికారంలోకి వచ్చింది. అయితే దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ కనీసం బీజేపీ కి సరైన రాజకీయ పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇటు కేంద్ర ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కూడా ప్రజలు దృష్టిని ఆకర్షించలేకపోయారు.
బీజేపీ పై తానూ పై చేయి సాధించాలి అనుకున్న ప్రతి సందర్భంలోను రాహుల్ గాంధీ వెనక్కి వెళుతూనే వచ్చారు. ఆయన నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా కేంద్రంలో అనుకున్న స్థాయిలో రాజకీయంగా రాణించలేకపోయింది. బీజేపీ దూకుడు రాజకీయాన్ని కట్టడి చేయలేకపోయింది.
రాహుల్ గాంధీ కి తోడు ఆయన సోదరి ప్రియాంక గాంధీని సైతం కాంగ్రెస్ రంగంలోకి దింపింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయింది. ఏ ఒక్క విషయంలో కూడా కాంగ్రెస్ ఎన్డీయే ప్రభుత్వం పై తానూ చేసిన పోరాటాలతో బీజేపీ మెడలు వంచలేకపోయింది, ఒంటెద్దు పోకడల మాదిరి బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలకు అడ్డుకట్ట వేయలేకపోయింది.
ఇటువంటి పరిస్థితులలో సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ తానూ చేపట్టిన మొదటి పోరాటంతోనే దేశ ప్రజల దృష్టిని ఆకర్షించగలిగింది, అలాగే అదే సమయంలో బీజేపీ ప్రభుత్వం మెడలు వంచగలిగింది. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా సీజేపీ నిర్వహించిన నీట్ ఉద్యయం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా దేశ ప్రధాని రేసులో ఉన్న రాహుల్ గాంధీకి ఒక దిక్సూచీల మారిందా అన్న చర్చ నడుస్తుంది.
కాంగ్రెస్ నేతృత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో నేడు ఢిల్లీ జంతర్ మంతర్ కేంద్రంగా జరిగిన నిరసన కార్యక్రమాలలో రాహుల్ గాంధీ నడుచుకున్న తీరు, ప్రభుత్వం పై పోరాటానికి దూకుడుగా ముందుకెళుతున్న విధానాలు కాంగ్రెస్ శ్రేణులకు సైతం కొత్త రాహుల్ ని పరిచయం చేస్తున్నాయి.
సీఈసీ జ్ఞానేశ కుమార్ రాజీనామా డిమాండ్ తో పోరాటం మొదలుపెట్టిన కాంగ్రెస్ దాన్ని మరింత బలంగా ప్రజలలోకి తీసుకెళ్లేందుకు, ఎన్డీయే ప్రభుత్వం పై మరింత రాజకీయ ఒత్తిడి పెంచేందుకు రాహుల్ చేస్తున్న అన్ని ప్రయత్నాలు రాహుల్ కి మీడియాలో పెద్ద అటెన్షన్ ను తీసుకొస్తున్నాయి.
ఇటు సోషల్ మీడియాలో సైతం రాహుల్ వీడియోలు వైరల్ కావడంతో దేశ ప్రజలలో, దేశ రాజకీయాలలో రాహుల్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. మారిన నేతగా తనకు తాను ప్రజలకు పరిచయం చేసుకోవడానికి రాహుల్ కి ఈ నిరశన కార్యక్రమాలు పెద్ద ఎత్తున సహాయపడుతున్నాయి. దీనితో ఒక రాజకీయ నాయకుడు కు అవసరమైన ఫ్రీ పబ్లిసిటీ ని నేడు రాహుల్ సొంతంగా సాధించుకుంటున్నారు.




