ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మద్య విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనప్పటికీ, రెండు రాష్ట్రాలలో అధికార పార్టీలైన బిఆర్ఎస్, వైసీపిలు మాత్రం పరస్పరం సహకరించుకొంటాయి.
ఇంకా విచిత్రమేమిటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొంటున్న కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా చక్రం తిప్పిన్నప్పటికీ, కేసీఆర్‌తో సహా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపి పాలనలో ఆంధ్రప్రదేశ్ దుస్థితి గురించి మాట్లాడుతూ అవహేళన చేస్తున్నప్పటికీ, వైసీపి నేతలకు, ప్రభుత్వానికి చీమ కుట్టిన్నట్లు కూడా అనిపించదు.
ఎందుకంటే, తెలంగాణ మంత్రులు తమను నోటితో వెక్కిరిస్తున్నా, 2019 ఎన్నికలలో తాము ఆయన దయతోనే గెలిచి అధికారంలో చేజిక్కించుకొన్నామనే కృతజ్ఞత, మళ్ళీ 2024 ఎన్నికలలో వైసీపికి తోడ్పడతారనే ముందుచూపు వల్లనే అని చెప్పక తప్పదు.
కనుక కేసీఆర్‌కు అత్యంత కీలకమైన శాసనసభ ఎన్నికలలో వైసీపి తరపున ఏపీ ప్రభుత్వం ఉడతాభక్తిగా సాయపడుతోంది. ఈ మాట ‘గిట్టనివారు’ ఎవరో అనలేదు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ, నల్గొండ కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఈరోజు తెలంగాణలో పోలింగ్ జరుగుతుంటే నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద, ఏపీ, తెలంగాణ పోలీసులు ఘర్షణ పడుతున్నారు. కేసీఆర్‌కు తాను ఓడిపోబోతున్నానని అర్దమవడంతో తెలంగాణ పోలీసులతో సాగర్ డ్యామ్ వద్ద హడావుడి చేయిస్తున్నారని, ఏపీ ప్రభుత్వం కూడా ఉడతా భక్తిగా తమ పోలీసులను పంపించిందని అన్నారు.
ఇరు రాష్ట్రాల పోలీసులు సాగర్ డ్యామ్‌పై కొట్టుకొనేలా చేసి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని ప్రయత్నిస్తున్నాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇన్ని రోజులుగా లేనిది హటాత్తుగా పోలింగ్ రోజునే సాగర్ డ్యామ్‌పై ఈ కొత్త డ్రామా ఎందుకు మొదలుపెట్టారో ప్రజలకు తెలుసని అన్నారు.
ఏపీలో వైసీపి ప్రభుత్వం ఈవిదంగా తెలంగాణ సెంటిమెంట్ రగిలించి కేసీఆర్‌ని గెలిపించేందుకు తోడ్పడుతోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతకీ సాగర్ డ్యామ్‌పై ఈ కొత్త డ్రామా ఏమిటంటే, రెండు రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన సాగర్ డ్యామ్‌పై ఆంధ్రప్రదేశ్ వైపు కంచె వేసుకోవాలనే ఆలోచన అధికారులకు హటాత్తుగా కలిగింది. దీంతో ఏపీ పోలీసులను వెంటబెట్టుకొని వెళ్ళి కంచె వేస్తుంటే, తెలంగాణ పోలీసులు వచ్చి అడ్డుకొన్నారు.
ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల పోలీసులకు మద్య ఘర్షణ జరిగింది. అలా జరిగితే, సహజంగానే తెలంగాణ ప్రజలకు ఆగ్రహం వస్తుంది. ఆ ఆగ్రహమే వారిని బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసేలా చేస్తుందని వారి ఆలోచన కావచ్చు. కానీ రాజకీయాల కోసం రెండు రాష్ట్రాల పోలీసులు ఘర్షణ పడేలా చేయడం దౌర్భాగ్యం కాకపోతే మారేమిటి?




