సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిల గురించి చాలా ఆసక్తికరంగా విశ్లేషణ చేశారు. ఈరోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకొన్నప్పుడు నేలమీద ప్రజల మద్యన నడిచారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత హెలికాఫ్టర్ ఎక్కి గాల్లో తిరుగుతున్నారు. పక్కనే ఊరుకి వెళ్ళేందుకు కూడా హెలికాఫ్టర్ ఎక్కి వెళుతున్నారు. కార్లు, కాన్వాయ్ అన్ని ఉన్నాయి కదా? కాస్త రోడ్ల మీద ప్రయాణిస్తే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కూడా తెలుస్తుంది కదా?రాష్ట్రంలో ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలను ఏవో కేసులు పెట్టి లోపల వేస్తుండటం మామూలే. కానీ పచ్చటి చెట్లు ఏం పాపం చేశాయి? ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటిస్తే అక్కడ పచ్చటి చెట్లను నరికించేస్తున్నారు?” అని ప్రశ్నించారు.
“తెలంగాణలో కేసీఆర్ నన్ను చూసి మా ఎమ్మెల్యేలకు ఓట్లేయమని అడిగితే ప్రజలు ఆయన మొహం చూసే ప్రజలు వారిని ఓడించి ఇంటికి పంపించేశారు. ఆయనేమో ఎవరినీ మార్చకుండా పదవి పోగొట్టుకొన్నారు. ఈయనేమో అందరినీ మార్చేసి పదవి పోగొట్టుకోబోతున్నారు. అంతే తేడా!
నిజానికి వైసీపి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సమీక్షా సమావేశాలు చేసే అధికారం ఉందా?లేదు కదా?అన్ని నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డే తీసుకొంటున్నారు కదా?మరి వారిని ఎందుకు మార్చేస్తున్నారు? అంటే కేసీఆర్‌లాగ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళితే తాను కూడా ఓడిపోతామనే భయంతోనే.
తండ్రి చేసిన అప్పులకు కొడుకు ఎలా బాధ్యుడు అవుతాడో అలా జగన్ కూడా తాను చేసిన తప్పులు, పాపాలకు ఎమ్మెల్యేలను బలిపశువులను చేసి తాను మాత్రం ఒడ్డున పడాలనుకొంటున్నారన్న మాట. కానీ ఎమ్మెల్యేలను మార్చేసినంత మాత్రన్న ప్రజలు ఆయన తప్పులను, పాపాలను క్షమించేసి మళ్ళీ గెలిపిస్తారనుకోవడం వెర్రితనమే. కనుక ఈ చివరి ప్రయత్నాలు ఏవీ ఫలించేవి కావు. అక్కడ కేసీఆర్‌లాగే ఇక్కడ ఈయనకి రోజులు దగ్గర పడ్డాయి. మరో నాలుగు నెలలే జగన్‌కు టైమ్ మిగిలి ఉంది,” అని సీపీఐ నారాయణ తేల్చి చెప్పేశారు.




