ఐపీఎల్ చరిత్రలో ఒకప్పుడు అత్యంత హీట్‌ను తీసుకొచ్చిన పోరు అంటే ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ అంటే కేవలం రెండు జట్ల పోటీ మాత్రమే కాదు, అంతకు మించి అనేలా ఉండేది. రెండు జట్ల అభిమానుల మధ్య సోషల్ మీడియా ఫ్యాన్-వార్స్, ఆటగాళ్ల మధ్య పోటీ— ఇలా ఈ మ్యాచ్ ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాగా ఉండేది.
కానీ కాలంతో పాటు ఈ క్లాసిక్ రైవల్రీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఈ ఇరు జట్లు సమాన స్థాయిలో నువ్వా నేనా అన్నట్టుగా మైదానంలో తలపడేవి. పోరులో విజయం ఎటు వెళ్తుందో చెప్పడం కూడా అత్యంత కష్టసాధ్యంగా ఉండేది.
చివరి బంతి వరకు ఇరు జట్ల అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూనే సాగేది ఈ పోరు. కానీ ఇప్పుడు గత కొన్ని ఏళ్లగా ఈ ఎల్-క్లాసికో పూర్తిగా ఏకపక్షంగా మారిపోతున్నాయి. దీంతో ఈ రైవల్రీ తన పాత మాయాజాలాన్ని కొంత కోల్పోయినట్లు అనిపిస్తోంది.
అయితే ఐపీఎల్ 2026 కు గానూ ఎల్-క్లాసికో గా పిలవబడే ఈ పోరు నేడు ముంబై లోని వాన్ఖేడే వేదికగా జరగనుంది. నేటి మ్యాచ్లో ఓటమి చెందిన జట్టు సుమారు ప్లే-ఆప్స్ పోరు నుండి బయటకు వెళ్ళినట్టే. ఈ ఒత్తిడి ఇరు జట్ల ఆటగాళ్లపై స్పష్టంగా కనిపించనుంది.
ఇటు చూస్కుంటే చెన్నై జట్టు తాము చివరగా ఆడిన మ్యాచ్లో హైదరాబాద్ పై సులువైన విజయాన్ని చేజార్చుకుని మ్యాచ్ ని కోల్పోయారు. బౌలింగ్ లో ఓ మాదిరిగా రాణించినప్పటికీ, బ్యాటింగ్ లో చెన్నై కు కష్టాలు ఇంకా తీరలేదు. ఇది చాలదన్నట్టు ఫామ్ లో ఉన్న ఆయుష్ గాయం కారణంగా ఈ ఐపీఎల్ నుండి తప్పుకున్నారు అనే న్యూస్ చెన్నై ఫ్యాన్స్ ను మరింత ఢీలా చేస్తుంది.
గడిచిన రెండు రోజుల నుండి మాజీ భారత కెప్టెన్- వికెట్ కీపర్, మహేంద్ర సింగ్ ధోని నెట్స్ లో బ్యాటింగ్ మరియు కీపింగ్ విపరీతంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించగా, ఈ మ్యాచ్ ఆడనున్నాడని నిన్న చాలా వార్తలు వచ్చినప్పటికీ, నేటికీ ఈ విషయాన ఏ అధికారిక ప్రకటన లేదు.
మరోవైపు ముంబై జట్టు తమ 13 ఏళ్ళ జింక్స్ ను బ్రేక్ చేస్తూ, మొట్ట మొదటిసారి ఐపీఎల్ లో తమ తొలి మ్యాచ్ ను గెలిచి రికార్డ్ తిరగరాయగా, ఆ పిమ్మట వరుసనే 4 మ్యాచ్లలో ఓటమిను చవిచూడక తప్పలేదు. అద్భుతమైన ఆటగాళ్ళెంతమందో ఉన్నప్పటికీ జట్టు ఎందుకు రాణించలేకపోతుంది అని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.
అదే సమయంలో గుజరాత్ జట్టు పై అహ్మదాబాద్ లో ఆడిన మ్యాచ్ 99 పరుగులతో గెలిచి, అటు నెట్ రన్-రేట్ ను ఇటు అహ్మదాబాద్ లో తమ చరిత్రలోనే మొదటిసారి గుజరాత్ జట్టుపై గెలుపు సాధించి మంచి జోష్ లో ఉన్నారు ముంబై. తిలక్ వర్మ సెంచరీ తో రాణించడం ముంబై ఆ మ్యాచ్లో విజయాన్ని అందుకుంది.
ఆ గెలుపు జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి. ఇప్పుడు ఈ రెండు జట్లు మళ్లీ ఒకరికొకరు ఎదురవుతున్నారు. కానీ ఈసారి ఇది పాత రోజుల్లా ఫైనల్ పోరు కాదు, ఇది ప్లే-ఆఫ్ ఆశలను నిలబెట్టుకునే పోరు. నేటి మ్యాచ్లో ఓటమి చెందే జట్టు సుమారు ఐపీఎల్ 2026 కు గుడ్-బాయ్ చెప్పేసినట్లే.
ఈ నేపథ్యంలో, ఈ మ్యాచ్ మళ్లీ పాత ఉత్కంఠను తెస్తుందా అనే ప్రశ్న ఉంది. ఫ్యాన్స్ మాత్రం మరో క్లాసిక్ పోరును ఆశిస్తున్నారు. ఎవరు గెలిచినా, ఈ మ్యాచ్ ఐపీఎల్ కథలో ఒక మలుపుగా నిలవొచ్చు. ఈ మ్యాచ్ మళ్ళీ పూర్వం చెన్నై-ముంబై ల పోరును గుర్తుకుతెచ్చేలా ఉండాలని కోరుకుందాం.. మరి నేటి మ్యాచ్లో గెలుపు ఎవరిదనుకుంటున్నారు?




