మొంధా తుఫాను: ప్రకృతికి మానవుడికి మద్య యుద్ధం!

Cyclone Mondha Impact

నాడు హూద్ హూద్ తుఫానుతో ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా… విశాఖపట్నం గజగజ వణికిపోయింది. తుఫాను పోయినా దాని వలన జరిగిన అపారమైన నష్టం నుంచి తేరుకునేందుకు సుమారు రెండు మూడు నెలల సమయం పట్టింది.

మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత దాదాపు అంతకు కొంచెం తక్కువ తీవ్రతతో మొంధా తుఫాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై విరుచుకు పడబోతోంది.

ADVERTISEMENT

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మొంధా తుఫానుగా మారి ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలపై విరుచుకుపడబోతోంది.

విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశలో, కాకినాడకు ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో 830 కిమీ దూరంలో ఉన్న ఈ వాయుగుండం ఆదివారం సాయంత్రం గంటకు 6 కిమీ వేగంతో మచిలీపట్నం-కళింగపట్నం వైపు మెల్లగా కదులుతోంది.

ఆదివారం రాత్రికి ఈ వాయుగుండం తుఫానుగా మారి సోమవారం ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటబోతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంగా ఈదురు గాలులు వీస్తాయని, కనుక జిల్లా అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆదివారం సాయంత్రం లేదా రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సిఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొంధా తుఫానుని ఎదుర్కోవడానికి చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించారు.

జిల్లాల వారీగా సహాయ సిబ్బందిని, విద్యుత్‌, వైద్య, మున్సిపల్ సిబ్బందిని సిద్దంగా ఉంచారు. తీర ప్రాంతాల వెంబడి పోలీసులను మొహరించి మత్స్యకారులు, ప్రజలు సముద్రంలోకి వెళ్ళకుండా అడ్డుకొని తిప్పి పంపించేస్తున్నారు.

వర్షం తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. పరిస్థితిని బట్టి మరో రెండు మూడు రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం ఆదేశించింది.

వాయు గుండం క్రమంగా బలపడుతూ మెల్లగా తీరం వైపు కదులుతూ తుఫానుగా మారబోతోంది. ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని మొంధా తుఫానుని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంది. ఈ సన్నివేశం చూస్తుంటే ఇది ప్రకృతికి మానవుడికి జరుగబోయే మహా యుద్ధంలా అనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories