పురందేశ్వరితో ఆటలా… అప్పుడే ఇద్దరు అవుట్!

Daggubati Purandeswari

వైసీపి అధినేత జగన్‌, ఎంపీ విజయసాయి రెడ్డి ఇద్దరూ మోడీ, అమిత్ షాలతో చాలా విధేయంగా ఉంటారు. కానీ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందినవారు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, మహిళ అయినప్పటికీ ఆమె పట్ల చాలా అనుచితంగా వ్యవహరిస్తుంటారు. వారి కాలాకేయ సైన్యం తమని వెంటపడి వేధిస్తోందని షర్మిల, సునీతా రెడ్డి ఇద్దరూ చెప్పుకుని బాధపడ్డారు.

వారినే ఉపేక్షించనప్పుడు దగ్గుబాటి పురందేశ్వరిని ఉపేక్షిస్తారనుకోలేము. అందుకే విశాఖ పోర్టులో పట్టుబడిన మాదకద్రవ్యాల కంటెయినర్‌తో ఆమెకు, ఆమె కుటుంబసభ్యులకు సంబంధం ఉందంటూ దుష్ప్రచారం చేశారు.

ADVERTISEMENT

ఆమె రాజమండ్రి నుంచి బీజేపీ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. కనుక ఆమెను ఎన్నికలలో దెబ్బ తీసేందుకు వైసీపి మరో దుష్ప్రచారం ప్రారంభించింది.

ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీల కూటమి గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మైనార్టీలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆమె చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లకు ముందే షరతు పెట్టారని, అందుకు వారిరువురూ కూడా అంగీకరించారని సోషల్ మీడియాలో వైసీపి దుష్ప్రచారం చేస్తోంది.

ఇది గుర్తించిన ఆమె బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపి చేస్తున్న దుష్ప్రచారానికి తక్షణమే అడ్డుకట్టవేయాలని కోరారు.

ఇక రాష్ట్ర డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డితో సహా 32 మంది ఐపిఎస్ అధికారులు వైసీపి నేతల కనుసన్నలలో పనిచేస్తున్నారని, కనుక వారందరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ పురందేశ్వరి ఏప్రిల్‌ 1న కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.

దానిపై ఈసీ స్పందిస్తూ ఆమె పేర్కొన్న వారందరి గురించి సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ మీనాను ఆదేశించింది.

ఆమె ఫిర్యాదు చేసినవారిలో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సిట్ అధిపతి కొల్లి రఘురామ రెడ్డి, ఫక్కీరప్ప (జాయింట్‌ సీపీ, విశాఖపట్నం) కూడా ఉన్నారు. వారిలో రఘురామ రెడ్డిని కేంద్ర ఎన్నికల కమీషన్‌ గౌహతీకి, ఫకీరప్పని బీహార్ రాష్ట్రంలోని నవాడాకు బదిలీ చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు వారిద్దరూ అక్కడే ప్రత్యేక పోలీస్ పరిశీలకులుగా పనిచేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశించింది.

వారితో రాష్ట్ర క్యాడర్‌కు చెందిన మరో 33 మందిని వేర్వేరు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులుగా బదిలీ చేసింది. ఒకవేళ పురందేశ్వరి ఫిర్యాదు చేసిన వారందరినీ కూడా బదిలీ చేసినా లేదా ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఆదేశించినా అది వైసీపికి పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories