ఏపీ బీజేపీకి టిడిపి, జనసేనలతో పొత్తులో భాగంగా 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు లభించాయి. వాటికి బీజేపీ అభ్యర్ధులను ప్రకటించేసింది. టిడిపి, జనసేనలు కూడా దాదాపు ప్రకటించేశాయి. అలాగే వైసీపి కూడా అభ్యర్ధులను ప్రకటించేసింది. టిడిపి, వైసీపి అధినేతలు అప్పుడే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేశారు.
ఈ ఎన్నికలలో కూటమిలోని పార్టీలకు వైసీపికి మద్య యుద్ధం జరుగబోతోందని అందరికీ తెలుసు. కానీ అంతకంటే ముందే మరి కొన్ని మినీ యుద్ధాలు జరుగబోతున్నాయి.
బీజేపీ ప్రకటించిన అభ్యర్ధులకు బీజేపీలోని టికెట్స్ రాని ‘వైసీపి మిత్రులకు’ మద్య ముసుగులో గుద్దులాటలు తప్పవు. కనుక బీజేపీ అభ్యర్ధులు వైసీపి కంటే ముందుగా సొంత పార్టీ నేతలనే జయించవలసి ఉంటుంది. అయితే వారితో పోటీ పడి టికెట్స్ సాధించారు కనుక ఇప్పుడు మొదలయ్యే రెండో మినీ యుద్ధంలో కూడా విజయం సాధించి వారి మద్దతు పొందగలిగితే, ఎన్నికలలో సగం విజయం సాధించిన్నట్లే.
అలాగే బీజేపీతో పొత్తు కారణంగా టిడిపి, జనసేనలలో టికెట్స్ పోగొట్టుకొన్నవారితోనూ మినీ యుద్ధాలు తప్పవు. దీని తర్వాత అసలు యుద్ధం మే 13న వైసీపితో జరుగుతుంది.
ఇక జనసేన పార్టీ కూడా ఇంచుమించు ఇటువంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. టికెట్స్ విషయంలో ఏర్పడిన అసంతృప్తి, అసహనంతో బాటు, కుల రాజకీయాలు, వైసీపి ఉచ్చులకు చిక్కుకొని ఇబ్బందులు సృష్టిన్నవారితో జనసేన సతమతమవుతోంది. పార్టీలో అందరినీ హెచ్చరిస్తూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఓ లేఖ వ్రాయాల్సి వచ్చిందంటే జనసేనలో కుమ్ములాటలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్దం చేసుకోవచ్చు.
టిడిపి కూడా అభ్యర్ధుల విషయంలో అంతర్గతంగా ఇటువంటి సమస్యలే ఎదుర్కొంటోంది. కానీ జనసేన, బీజేపీలతో పోలిస్తే తక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే టిడిపి మీద వైసీపి ప్రభావం దాదాపు ఉండదు కనుక! కానీ జనసేన, బీజేపీల మీద వైసీపి ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుంది కనుక ఆ రెండు పార్టీలకు కొన్ని ఊహించని సమస్యలు, ఇబ్బందులు తప్పకపోవచ్చు.
కనుక జనసేన, బీజేపీలు వీలైనంత త్వరగా ఈ సమస్యలను అధిగమించి అసలు యుద్ధానికి సిద్దం కావలసి ఉంటుంది.
ముఖ్యంగా మూడు పార్టీలు కలిసి ఉమ్మడి ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహించగలిగినప్పుడే ప్రజలకు వారి కూటమిపై నమ్మకం ఏర్పడతాయి. అప్పుడే మూడు పార్టీల మద్య ఓట్ల బదిలీ జరుగుతుంది.




