వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు పలు చోట్ల కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీ తలపోటుగా మారింది. ఆ పార్టీ అభ్యర్ధుల పేర్లకు దగ్గరగా ఉండే పేర్లు ఉన్నవారితో ప్రజాశాంతి పార్టీ పేరుతో నామినేషన్ లు వేశారు. దానికి తోడు ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ వైకాపాకు చెందిన ఫ్యాన్ గుర్తుకు దగ్గరగా ఉండడంతో ఆ పార్టీ నేతల గుబులు మొదలయ్యింది. దీని వల్ల కొందరు వృద్దులు, నిరక్షరాస్యులు పొరపాటు పడి ప్రజాశాంతి పార్టీకి ఓటు వేస్తే వైకాపాకు నష్టజరగవచ్చని ఆ నాయకులు మాధానపడుతున్నారు.
తాజాగా పర్చూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ అల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా ఇదే సమస్య పట్టిపీడిస్తోంది. ఒంగోలు సమీపంలోని పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పర్చూరు అసెంబ్లీకి నామినేషన్ వేశారు. ఒకవేళ ఈ నామినేషన్ గనుక ఎన్నికల కమిషన్ ఒకే చేస్తే పరిస్థితి ఏమిటి అనేది స్థానిక వైకాపా నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ సీటు నుండి తొలుత వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ ను పోటీ పెట్టాలని అనుకున్నారు.
అతని కోసమే వెంకటేశ్వరరావు జగన్ వద్దకు వెళ్ళారు. అయితే హితేష్ కు ఉన్న అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో ఆయన నామినేషన్ రద్దు అయ్యే అవకాశం ఉండటంతో అతనిని కాదని వెంకటేశ్వరావు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలో ఆయన పోటీ చెయ్యలేదు. ఇక ఎన్నికల రాజకీయాలు చెయ్యనని ప్రకటించేశారు కూడా. అయితే కొడుకు కోసం మాట మార్చుకున్నారు. మరోవైపు, దగ్గుబాటి సతీమణి పురంధేశ్వరి బీజేపీ టిక్కెట్ పై విశాఖపట్నం పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారు.



