రెండు బిల్లులతో దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు!

Indian Parliament discussing women reservation and delimitation bills for political reforms

నేటి నుంచి మూడు రోజులు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ మూడు రోజుల్లో మూడు బిల్లులు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు. వాటిలో చట్ట సభలలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేస్తూ కల్పించే బిల్లు, దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి చట్ట సవరణ బిల్లు ఉన్నాయి.

వీటిలో మహిళా రిజర్వేషన్ బిల్లుకి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కనుక దీని ఆమోదానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ADVERTISEMENT

కానీ డీలిమిటేషన్‌ బిల్లుని కాంగ్రెస్‌, మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కనుక దీనిపై వాడి వేడిగా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది.

ఇలాంటి సమస్య ఎదురవుతుందని కేంద్రం ముందే ఊహించింది కనుక తెలివిగా దీనిని మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడి పెట్టింది.

ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలు ఒకేసారి 850కి పెరుగుతాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చితే ఆ 850 స్థానాలలో 33 శాతం అంటే 273 సీట్లు మహిళలకు దక్కుతాయి.

కనుక డీలిమిటేషన్‌ బిల్లుని వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించినట్లే అవుతుందని బిజేపి నేతలు వాదిస్తున్నారు.

కానీ ఇలా మోసపూరితంగా బిల్లుని ఆమోదింపజేసుకోవడం కంటే డీలిమిటేషన్‌ విషయంలో తమ అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించి అవసరమైన మార్పులు చేర్పులు చేయవచ్చు కదా? అని కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు వాదిస్తున్నాయి. కానీ కేంద్రం వాటి వాదనలను కొట్టి పడేసి బిల్లుని ఆమోదింప జేసుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంది.

టీడీపి, జనసేన వంటి ఎన్డీయే భాగస్వాములు ఎలాగూ ఈ బిల్లుకు మద్దతు ఇస్తాయి. కేసులు, రాజకీయ అవసరాల కారణంగా వైసీపీ వంటి సింగిల్ సింహాలు కూడా ఈ బిల్లుకి మద్దతు ప్రకటిస్తున్నాయి లేదా బిల్లుపై ఓటింగ్ జరిగే సమయంలో కుంటి సాకులతో సభ నుంచి వాకవుట్ చేసి ఈ బిల్లుకి ఆమోదముద్ర పడేందుకు తోడ్పడుతాయి.

డీలిమిటేషన్‌ బిల్లు చట్ట రూపం దాల్చితే రాష్ట్రాలలో లోక్‌సభ, శాసనసభ సీట్లు భారీగా పెరుగుతాయి. వాటితో పాటు మహిళలకు 33శాతం సీట్లు పెరుగుతాయి. కనుక దీంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలలో చాలా మంది రాజకీయ నిరుద్యోగులకు వీటితో పదవులు లభిస్తాయి. ఈ కారణంగానే ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా అంతర్గతంగా వీటికి ఆమోదముద్ర పడాలనే కోరుకోవడం సహజం.

కనుక ఈ రెండు బిల్లులు చట్ట రూపం దాల్చితే కేసీఆర్‌ భాషలో దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories