‘వంగవీటి’ సినిమా కోసం దేవినేని నెహ్రూతో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన దేవినేని నెహ్రూ పలు ఆసక్తికర ప్రకటనలు చేసారు. గత చరిత్ర గురించి పెద్దగా చర్చలు జరగలేదని, గతమంతా వర్మకు తెలుసని చెప్పిన నెహ్రూ బెజవాడ రౌడీయిజంపై కామెంట్స్ చేసి, ‘రౌడీ’ అన్న పదానికి సరికొత్త అర్ధం చెప్పారు.
“తన దృష్టిలో సమాజంలో చెడును వ్యతిరేకించే ప్రతివాడు ‘రౌడీ’యేనని… అయితే అసలు రౌడీ అంటే ఎవరంటే… తాగడమో, ప్రజల మీద రుబాబు చేయడమో, ప్రజలను దోచుకోవడమో, ఆడపిల్లలను ఏడిపించడమో వంటి చేష్టలు చేసే వాడిని రౌడీలు అంటారని, అయితే వీళ్ళను నిలువరించడానికి ఎదిరించే వారిని కూడా మీరు రౌడీలుగా చిత్రీకరిస్తున్నారని, దానికి ‘రౌడీయిజం’ పేరు పెట్టుకుంటే మేమేమీ చేయలేమని” అన్న దేవినేని నెహ్రూ ఈ సందర్భంగా జర్నలిస్టులపై సెటైర్లు వేసి నవ్వించారు.
“తానూ వర్మకు సూచించిన ఒకే ఒక అంశం… ఇటీవల విడుదలైన పాటల్లో మార్పు చేయాలని కోరారని, అది అతనికి ఇష్టమైతే మార్చుకుంటారని” అన్నారు. ‘తన ముందు పెరిగిన వాళ్ళంతా బెజవాడ చరిత్ర గురించి చెప్తుంటే, మనమేమీ చెప్తాం… 1972లో చలసాని వెంకట రత్నం, 74లో రాధ, 79లో గాంధీ, 88లో మురళీ, 88 డిసెంబర్ లో రంగా చనిపోయారని, ఇవి కాకుండా బెజవాడలో రోజుకో మర్డర్ జరుగుతోందని, అయితే వీటిలో రాజకీయాలు ఉన్నాయి గనుక, మీ రేటింగ్ పెంచుకోవడానికి పనికొస్తుంది” అంటూ ముగించారు దేవినేని.





