దేశ వ్యాప్తంగా సంచనలంగా మారుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ పై బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులన్నీ ఏకమవుతున్నాయి. సీజేపీ, కాంగ్రెస్ మొదలుకుని విజయ్ టీవీకే వరకు కాంగ్రెస్ మిత్రపక్షాల్ని కూడా బీజేపీ కి వ్యతిరేకంగా నడుంబిగిస్తున్నాయి.
నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర రాజీనామా చేయాలంటూ పట్టుబడుతున్న ఈ పార్టీలన్నీ కూడా నేడు బీజేపీ పెద్దల వైఖరికి వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ తో సైద్ధాంతిక రాజకీయ విభేదాలున్నాయి అంటూ ప్రచారం చేసుకునే వైసీపీ కానీ బిఆర్ఎస్ కానీ కాక్రోచ్ ల డిమాండ్ పై నోరు మెదపడం లేదు.
వైసీపీ ప్రత్యక్షంగా బీజేపీ తో రాజకీయ పొత్తు పెట్టుకోపోయినప్పటికీ బీజేపీ, వైసీపీ మధ్య తెరవెనుక రాజకీయం వేరే కథ అనేది జగమెరిగిన సత్యమే. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ తో ప్రత్యక్ష రాజకీయ పోరుకి సై అనే బిఆర్ఎస్ కూడా కాక్రోచ్ల ఉద్యమంలో మౌన పాత్ర పోషిస్తుంది.
నీట్ విద్యార్థులకు మద్దతుగా సాగుతున్న ఈ పోరాటం లో బిఆర్ఎస్ తన వంతు పాత్ర పోషించేందుకు పెద్దగా ఆస్తక్తి చూపించలేకపోతుంది వై.? అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిపోయింది.
కాంగ్రెస్, బీజేపీ లు మాకు రాజకీయ ప్రత్యర్థులు అంటూ ప్రచారం చేసుకునే బిఆర్ఎస్ ఇప్పుడు ఆ ప్రత్యర్థులలో ఒకరు రాజకీయంగా ఆత్మరక్షణలో పడినప్పుడు బిఆర్ఎస్ మౌనాన్నీ ఆశ్రయించడం వెనుక ఉన్న ఆ రాజకీయ వ్యూహమేమిటి.? అన్నది ఆసక్తిగా మారింది.
పార్టీ అధినేత కేసీఆర్ కానీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఈ అంశంలో నిరాశనకారులకు మద్దతుగా కానీ బీజేపీ కి వ్యతిరేకంగా కానీ ఒక్క ప్రకటన కూడా చెయ్యలేదు. నేడు హైద్రాబాద్ లో అధికార కాంగ్రెస్ కేంద్ర బీజేపీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించింది.
చేతులకు సంకెళ్లు వేసుకుని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యే లు మోడీ సర్కార్ కు తమ నిరశన తెలియచేసారు. అయితే తెలంగాణలో ఇంత జరుగుతున్నా బిఆర్ఎస్ నుంచి కనీస స్పందన కరువయ్యింది. దీనితో భవిష్యత్ రాజకీయ అవసరాలు బిఆర్ఎస్ నోటికి తాళాలు వేస్తున్నాయా.?
కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా బీజేపీ – బిఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం జరిగిపోయిందా.? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దేశం మొత్తాన్ని ఊపేస్తున్న ఇటువంటి అంశం పై రాజకీయంగా బీజేపీ మిత్రపక్షాలు కానీ వైసీపీ, బిఆర్ఎస్ మౌనం వహించడమంటే వైసీపీ, బిఆర్ఎస్ విమర్శలకు, ప్రకటనలకు అర్ధాలు వేరనుకోవాలా.?






