
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయినందున ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలను ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నించాలి. కానీ ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకపోయినా ‘జగన్ ఇమేజ్’ చూసి రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చేస్తున్నాయని గొప్పగా చెప్పుకొంటారు. కానీ అవెక్కడున్నాయో మాత్రం చెప్పరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలను ఆకర్షించలేకపోతే పోయే, కనీసం ఉన్నవాటినైనా కాపాడుకొని ఉంటే బాగుండేది. కానీ వాటినీ రాజకీయకోణంలో నుంచి చూస్తూ టిడిపికి చెందిన పారిశ్రామికవేత్తలను వైసీపి ప్రభుత్వం ఏవో కేసులతో వేధిస్తూనే ఉంది.
తాజాగా సంగం డెయిరీ డైరెక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల గుంటూరు జిల్లా చేబ్రోలులోని సంగం డెయిరీ సమీపంలో చిన్న ఘర్షణ జరిగింది. ఆ కేసులోనే పోలీసులు సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ నరేంద్ర, గొల్లపల్లి శ్రీనివాస్‌తో సహా 15మందిపై హత్యానేరం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు! ఆదివారం తెల్లవారుజామున గొల్లపల్లి శ్రీనివాస్‌తో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీని, ధూళిపాళ నరేంద్ర అధ్వర్యంలో నడుస్తున్న సంగం డెయిరీని వ్యాపారపరంగా దెబ్బ తీసేందుకే వైసీపి ప్రభుత్వం గుజరాత్ నుంచి అమూల్ డెయిరీని తీసుకువచ్చిందని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.
రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్న హెరిటేజ్, సంఘం డెయిరీలలో వేలాదిమంది పనిచేస్తున్నారు. ప్రతీరోజు లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తుండటం వలన వేలాదిమంది పాడిరైతులకు ఎంతో మేలు కలుగుతోంది. అలాగే చిత్తూరులో అమర్ రాజా బ్యాటరీస్ కూడా దశాబ్ధాలుగా విజయవంతంగా నడుస్తోంది. అది కూడా అనేకమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తోంది.
కనుక ఏ ప్రభుత్వమైనా అటువంటి సంస్థలకు అండగా నిలబడాలి. కానీ అవి టిడిపి నేతలవి కావడంతో ప్రభుత్వమే వాటిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుండటం చాలా శోచనీయం.
రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం, రాష్ట్రంలో వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను కూడా రాజకీయ కారణాలతో వేధిస్తుంటే, ఇక ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు రమ్మంటే వస్తాయా? రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలు రాకపోతే, ఉన్నవాటిని తరిమికొడుతుంటే రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి?ఉద్యోగాలు, ఉపాధి లభించక అందరూ ఏపీని వదిలి పొరుగు రాష్ట్రాలకు వలసలు పోవలసిన ఖర్మ ఏమిటి?
దేశంలో అన్ని రాష్ట్రాలు డానికి పోటీ పడుతూ ఎన్నో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. తెలంగాణలో అనేక ఐటి కంపెనీలు, పరిశ్రమలు చాలానే ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఏడాదికి కనీసరి రెండుసార్లు విదేశాలలో పర్యటించి పెద్ద పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలతో మాట్లాడి రాష్ట్రానికి తెచ్చుకొంటుంటారు.