ఈ సినిమా పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉన్నా… విడుదలైన సమయంలో దర్శకుడు సుకుమార్ మీద రకరకాల విమర్శలు వెలువడ్డాయి. సినిమాలోని లోపాలను ఎత్తి చూపే కార్యక్రమం విశ్లేషకులు తీసుకోగా, సినిమాకు పెట్టిన ఖర్చుల ప్రచారాన్ని ఇండస్ట్రీ వర్గాలు తీసుకున్నాయి. అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ మొత్తం లండన్ లోకేషన్లను ఎంచుకుని సినిమా బడ్జెట్ ను సుకుమార్ అమాంతం పెంచేసారని, గత సినిమా “1 నేనొక్కడినే” క్కూడా సుక్కూ ఇదే వైఖరికి అవలంభించి భారీ నష్టాలకు కారణమయ్యారనే వ్యాఖ్యలు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి.
అయితే, అసలు లండన్ ఎంపిక ఎవరిదనే విషయం తెలుసుకున్న సినీ జనాలు అవాక్కవుతున్నారు. “లండన్, స్పెయిన్ లోకేషన్ల ఎంపిక నిర్ణయం తనది కాదని, నిర్మాత, హీరోదేనని” సుకుమార్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. అక్కడ నిబంధనలు షూటింగ్ కు అనువుగా ఉంటాయని, అలాగే గ్యాస్ వంటి సహజ సంపద విషయంలో యుకే నిబంధనలు వేరుగా ఉంటాయని, అదే ఇండియాలో అయితే సినిమాలో కీలకంగా మారిన గ్యాస్ ప్లాంట్ ఎపిసోడ్ కు సినిమాలో ఆస్కారం వుండేది కాదని, మన రూల్స్ అలా ఉన్నాయని సుకుమార్ చెప్పుకొచ్చారు.
నిజానికి లండన్ అందాలను సుకుమార్ వెండితెరపై అద్భుతంగా చూపించారన్న టాక్ తొలి రోజు నుండి వ్యక్తమైంది. బహుశా మరో తెలుగు దర్శకుడికి సాధ్యం కాని రీతిలో లండన్ లోని లొకేషన్లను ఎంపిక చేసుకున్నారని సినీ విశ్లేషకులు కూడా కితాబిచ్చారు. మొత్తానికి తాజా వివరణతో సుకుమార్ పై పడ్డ మచ్చ తొలగినట్లేనని భావించవచ్చు.





