Director Sukumarబాక్సాఫీస్ వద్ద కనకవర్షం అయితే కురిపించింది గానీ, “పుష్ప ది రైజ్” ఆశించిన రీతిలో ప్రేక్షకులను అలరించలేదన్నది వాస్తవం. అల్లు అర్జున్ అభినయం మరియు మొదటిసారిగా సినిమా మొత్తం చిత్తూరు మాండలిక పదజాలాన్ని వినియోగించడం ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురిచేసింది.

ఈ విషయాన్ని పరోక్షంగా సుకుమార్ కూడా ఒప్పుకున్నారు, అందుకే “పుష్ప ది రూల్” మాత్రం మిమ్మల్ని నిరుత్సాహ పరచదు అన్న నమ్మకాన్ని ఇస్తున్నారు. పుష్ప రాజ్ జీవితం ఎలా ముగుస్తుందో అన్నది సెకండ్ పార్ట్ లో ఉంటుందని, అలాగే పుష్ప – షెకావత్ ల మధ్య పోరు చిత్ర ప్రధాన కధగా చెప్పుకొచ్చారు.

చాలా ఆసక్తికరమైన డ్రామా పుష్ప 2 స్క్రిప్ట్ లో ఉంటుందని, ఈ సినిమా మిమ్మల్ని నిరుత్సాహ పరచదు, అందుకు తాను హామీ అంటూ సుకుమార్ చేసిన వ్యాఖ్యలు సెకండ్ పార్ట్ పై అంచనాలు పెంచేలా ఉన్నాయి. తాను ఎంతగా ఈ స్క్రిప్ట్ రాసేటపుడు ఎంజాయ్ చేసానో, ప్రేక్షకులు చూసిన తర్వాత కూడా అంత ఎంజాయ్ చేస్తారన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు సుకుమార్.

సహజంగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఏదైనా సినిమా రిలీజ్ కు ముందు పబ్లిసిటీలో భాగంగా చెప్తుంటారు, కానీ సుకుమార్ ‘పుష్ప 2’ ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే చెప్తున్నారంటే, ‘పుష్ప’ మొదటి భాగంలో జరిగిన తప్పులను సవరించుకుంటున్నారా? ‘పుష్ప’ సినిమా రిలీజ్ అయ్యే వరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను చేస్తూనే ఉన్న సుక్కు, ప్రమోషన్స్ కు పూర్తిగా దూరంగా ఉన్నారు.

ఒకానొక సమయంలో అయితే ‘పుష్ప’ సినిమా సరిగా వచ్చిందో లేదో అన్న అనుమానం కూడా ఇండస్ట్రీ వర్గాల నుండి వ్యక్తమయింది. అంతలా సుక్కు అభిమానులతో సహా అందరినీ టెన్షన్ పెట్టారు. ఈ సారి అలాంటి ట్విస్ట్ లకు తావు లేకుండా పూర్తి క్లారిటీతో ఉన్నారని చెప్పడం కోసమే, ముందుగానే “పుష్ప 2” గురించిన సంగతులను చెప్పేస్తున్నారనుకుంటా!