దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాస్కులు అడిగినందుకు గానూ ఆయనను పిచ్చోడిగా ముద్రవేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి. ఈ కేసు హైకోర్టు వరకు వెళ్లడంతో ఆ కేసును సిబిఐకి అప్పగించింది న్యాయస్థానం. సిబిఐ దర్యాప్తు కూడా నమోదు చేసింది.
అయితే దర్యాప్తు జరుగుతుండగా… సుధాకర్ మీడియా ముందుకు వచ్చి “సీఎం జగన్ గారు నాకు దేవుడు. మోదీ గారిని కూడా నేను తిట్టలేదు. వాళ్లను తిట్టే ధైర్యం ఉందా?, శత్రువులను కూడా నేను తిట్టను. ప్రధాని మోదీ అంటే ఎంతో ఇష్టం. అలాంటి నాయకుడ్ని తిడతానా?, ఇక జగన్ గారైతే పేదల పాలిట మంచి పనులే చేస్తున్నారు. నాకు ఆ పార్టీ.. ఈ పార్టీ అంటూ ఏమీ ఉండదు,” అని అన్నారు.
“నేనైతే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. పేదలకు సేవ చేయాలనే ఉద్యోగం చేస్తున్నా. జీతం రాక ఇంట్లో ఇబ్బంది పడుతున్నా. ముఖ్యమంత్రి జగన్ గారు క్షమించి నా ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నా,” అంటూ వేడుకున్నారు. “అధికారులు ఏం అడిగారో నాకు అర్థం కాలేదు. నేను కేసులు విత్ డ్రా చేసుకుంటా …నా ఉద్యోగం ఇప్పిస్తే చాలు,” అంటూ ప్రాధేయపడ్డారు.
సుధాకర్ మీద ప్రభుత్వం తనదైన శైలిలో ఒత్తిడి తెచ్చి దారికి తెచ్చుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ విషయంలో ప్రభుత్వం నయాన్నో భయాన్నో తన చేతికి మట్టి అంటకుండా బయటపడిందని చెప్పవచ్చు. ప్రపంచ మీడియాలో కూడా వచ్చిన వార్తకు అంతే సంచలన ముగింపు వచ్చింది.





