ఒకప్పుడు అంటే సుమారు 30-40 ఏళ్ల క్రితం చదువుకున్నా ఉద్యోగాలు లభించేవి కావు. ఏదైనా సమాచారం కావాలన్నా రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి పత్రికలు, రేడియో లేదా దూరదర్శన్ ఛానల్ మాత్రమే ఉండే టెలివిజన్‌పై ఆధారపడాల్సి వచ్చేది. అవకాశాల లేమి, సాంకేతికత అందుబాటులో లేకపోవడం వల్ల ఆ కాలంనాటి యువత నిరుద్యోగ సమస్యతో చాలా బాధపడేది.
కానీ ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అనేక కొత్త రంగాలు, వాటికి అవసరమైన కొత్త నైపుణ్యాలు, ఇంట్లోనే కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఏ కంపెనీకైనా పని చేసే అవకాశాలు యువతకు అందుబాటులోకి వచ్చాయి.
ఒకప్పుడు దొరకని సమాచారం ఇప్పుడు కొన్ని సెకన్లలోనే చేతిలోని మొబైల్ ఫోన్‌లో అందుబాటులోకి వస్తోంది. గతంతో పోలిస్తే జీవనశైలి కూడా చాలా సౌకర్యవంతంగా మారింది.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు అవకాశాలు లేక యువత ఇబ్బందులు పడితే, ఇప్పుడు అవకాశాల మధ్య ఉన్న యువత మరోరకమైన సమస్యలతో పోరాడుతోంది.
ఉద్యోగాలు, పని ఒత్తిళ్లు, పింక్ స్లిప్పులు వంటివి మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. సోషల్ మీడియా కారణంగా ఊహించని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. నిత్యం పోటీ పడుతూనే ఉండాలి. పరుగులు తీస్తూనే ఉండాలి.
ఈ పని ఒత్తిళ్ల కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక జంక్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. తత్ఫలితంగా చిన్న వయసులోనే ఊబకాయం, అధిక బరువు, అలసట, ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు దాదాపు అదే నిష్పత్తిలో ఈ సమస్యలన్నీ పెరుగుతూనే ఉన్నాయి.
యువతపై పడుతున్న ఈ ప్రభావాలకు ముందుగా కుటుంబాలు, తర్వాత సమాజం, రాష్ట్రాలు, దేశాలు మూల్యం చెల్లించే ప్రమాదం పొంచి ఉంది. కనుక ఎప్పటికప్పుడు ఎవరికి వారు ఈ సమస్యలను గుర్తించి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగక తప్పదు.






