ఇది తీరని అసమ్మతి.. పాత సీన్లే రిపీట్ అవ్వడం ఖాయం

Balineni Srinivas Reddyరాజకీయాల్లో శాశ్వత శత్రువులు గాని మిత్రులు గాని ఉండరు అనే మాటలు మనం వింటూనే ఉంటాం. అదేవిధంగా రాజకీయాల్లో బంధుత్వాలు ఉండవు, వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి అనే వ్యాఖ్యలు కూడా మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ వ్యాఖ్యలు అక్షరాల నిజమే అని అనిపిస్తుంది కొన్ని సందర్భాలను చూసినప్పుడు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగు రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని తనకున్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ శిబిరంలో ఆందోళన మొదలయ్యింది. జగన్ వైఖరి తట్టుకోలేక, తన సీనియారీటీకి తగ్గట్లుగా పార్టీలో గౌరవం లభించడంలేదని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేది బాలినేని వర్గీయుల మాట.

ADVERTISEMENT

బాలినేని అసంతృప్తి గా ఉన్న అంశాలు :

1. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా మంచి పట్టు ఉన్న నాయకుడు బాలినేని. అలాంటి బాలినేనికి మంత్రివర్గ విస్తరణలో రెండవసారి చోటు దక్కకపోవడం. అదే జిల్లాకు చెందిన ఆదిములపు సురేష్ కి రెండవసారి కూడా మంత్రి పదవి దక్కడం బాలినేనికి మింగుడు పడని అంశం.

2. ఇటీవల మార్కాపురంలో జరిగిన ముఖ్యమంత్రి పర్యటనలో అనుమతిలేదంటూ హెలిప్యాడ్ వద్దకు బాలినేనిని అనుమతించకపోవడం. అక్కడి నుండి బాలినేని అలిగి వెళ్ళిపోవడం, విషయం తెలిసి జగన్ స్వయంగా ఫోన్ చేసి బాలినేని సభకు రప్పించడం జరిగాయి.

3. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలను బాలినేనికి అప్పగించడం. కానీ ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు పట్టించుకోకపోవడం బాలినేనికి అస్సలు మింగుడు పడని అంశాలు.

4. ప్రోటోకాల్ లేని పార్టీ పదవిలో కొనసాగడం ఇష్టం లేకపోవడం.

5. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుండి బాలినేనిని కాకుండా మహిళను బరిలోకి దించబోతున్నారనే వ్యాఖ్యలు వస్తుండటం

తదితర అంశాలు బాలినేనికి అస్సలు నచ్చడం లేదంట.ఇన్ని అవమానాలు పడేకంటే పార్టీకి గుడ్ బై చెప్పేస్తే బాగుంటుందని బాలినేని భావిస్తున్నారట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మరియు కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్ కి వెన్నంటే ఉండి నడిచిన వ్యక్తి బాలినేని అని, అలాంటి బాలినేనికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై బాలినేని వర్గీయులు మండిపడుతున్నారు.

ఈరోజు తాడేపల్లి సియం క్యాంపు కార్యాలయంలో బాలినేని జగన్ తో సుమారు 2 గంటల పాటు భేటీ అయినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలుస్తుంది. జగన్ నుండి స్పష్టమైన హామీ రాకపోవడంతో బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన వర్గీయులు చర్చించుకుంటున్న పరిస్థితి. అందుకే ఆయన మీడియాతో కూడా మాట్లాడడానికి నిరాకరించారని తెలుస్తుంది.

తాడోపేడో తెలుచుకోవాలనే బాలినేని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఒక వేళ అదే జరిగితే పార్టీకి టాటా చెప్పేస్తే తరువాత ఏ పార్టీలో చేరాలి అనే అంశంపై ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారి బాటలోనే బాలినేని కూడా త్వరలో వైసీపీకి రాజీనామా చేస్తారు అనే మాటలు బాలినేని అనుకూల వర్గం నుండి వినిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాలినేని రాజీనామా చేస్తే వైసీపీకి ప్రకాశం జిల్లాలో పట్టుకోల్పోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన రూపంలో కాపు సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలు వైసీపీ నుండి చేజారిపోతున్న పరిస్థితి. మరో పక్క జగన్ సొంత సామాజికవర్గానికి చెందిన బలమైన అసంతృప్తి నేతల రూపంలో కొన్ని నియోజకవర్గాలు చేజారిపోతున్న పరిస్ధితి. అందుకు నిదర్శనం గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే అన్నది విశ్లేషకుల అభిప్రాయం.

జగన్ వైఖరికి ప్రస్తుతం వైసీపీ లో ఉన్న సీనియర్ నేతలకు అస్సలు పొసగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే గౌరవం లేని చోట బలవంతంగా ఉండటం కంటే, గౌరవం దక్కేచోట ఉండి ప్రశాంతంగా ఉండటం మేలు అనే ఆలోచనలోకి వచ్చారంట ఆ అసంతృప్తి నేతలు.

మరి వారికి గౌరవం, ప్రశాంతత ఏ పార్టీలో దొరుకుతాయో వేచి చూడాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories