మర్రిచెట్టు నీడలో ఏ మొక్క ఎదగలేదు. అలాగే ఓ జాతీయ పార్టీ లేదా ప్రాంతీయ పార్టీల నీడ మరో పార్టీ ఎదగలేదు. జాతీయ స్థాయిలో చూసుకుంటే, దశాబ్ధాలుగా కాంగ్రెస్ లేదా బీజేపీ అన్నట్లు సాగేది. ఆ తర్వాత నాయకత్వ లోపం కారణంగా కాంగ్రెస్ బలహీనపడటంతో జాతీయస్థాయిలో, కేంద్రంలో బీజేపీ మాత్రమే అన్నట్లు మారిపోయింది.
కేసీఆర్ వంటివారు ఎన్ని కుప్పి గంతులు వేసినా ఎన్నికల వరకే. ఎన్నికలు దగ్గర పడేసరికి అందరి కాళ్ళు చల్లబడిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మోడీని ప్రేమిస్తూనో లేదా ద్వేషిస్తూనో లేదా రహస్యంగా సంబంధాలు పెట్టుకునో రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయకుండా చేశారు. కాంగ్రెస్, టిడిపిలను ముందే బలహీనపరిచి ఎదురు లేకుండా జాగ్రత్తపడ్డారు. కానీ మొన్న ఎన్నికలలో కాంగ్రెస్‌కి ‘అన్నీ కలిసి రావడంతో’ కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేసి వెళ్ళిపోక తప్పలేదు.
ఏపీ విషయానికి వస్తే, రాష్ట్ర విభజనకు ముందు వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెత్తనమే సాగేది. కానీ రాష్ట్ర విభజన ఏపీని మాత్రమే కాదు… కాంగ్రెస్ పార్టీని కూడా దెబ్బ తీసిందని అందరికీ తెలుసు.
ఆ తర్వాత ఏపీలో టిడిపి, జనసేనలతో పొత్తు పెట్టుకోవడం వలన రాష్ట్రంలో బీజేపీ ఎదిగేందుకు చాలా గొప్ప అవకాశం లభించింది. కానీ బీజేపీ అధిష్టానం దానిని గుర్తించలేకపోయింది. కొత్త రాష్ట్రంలో టిడిపి బలపడగలిగింది కానీ బీజేపీ నేటికీ బలపడలేకపోయింది. కారణం పైన చెప్పుకున్నట్లు ఇదివరకు టిడిపి నీడలో, ఇప్పుడు వైసీపి నీడలో గడిపేస్తుందటమే!
కానీ రాష్ట్రంలో టిడిపి, జనసేన, వైసీపి మూడు పార్టీలని బీజేపీ పెద్దలే కదా శాశిస్తున్నారు? అని సందేహం కలుగవచ్చు. అది నిజమే! కానీ, వాటిని మేము తెలివిగా వాడుకొంటున్నామని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారే తప్ప వాటి నీడలో సేద తీరుతో రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయకుండా చేస్తున్నామని వారు అనుకోవడం లేదు!
ఉదాహరణకు తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి కొండంత అండగా నిలబడటంతో ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలిగారు. కానీ బీజేపీని గెలిపించే స్థాయికి తీసుకువచ్చిన బండి సంజయ్‌ని ఎన్నికలకు ముందు పదవిలో నుంచి తొలగించుకొని కూర్చోన్న కొమ్మను నరుక్కోవడం అందరూ చూశారు.
ఏపీ బీజేపీ పట్ల కూడా ఆ పార్టీ అధిష్టానం సరిగ్గా అదేవిదంగా వ్యవహరిస్తుండటం వలననే ఏపీలో బీజేపీ బలపడలేకపోతోంది. దగ్గుబాటి పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా నియమించిందే తప్ప, రాష్ట్ర రాజకీయాలలో ఆమె ప్రమేయం లేకుండా చేస్తోంది.
ఆమెను నోటికి వచ్చిన్నట్లు దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డితో మోడీ, అమిత్ షాలు భేటీ అవుతూ ప్రజలకు, పార్టీకి కూడా తప్పుడు సంకేతాలు పంపిస్తూనే ఉన్నారు.
ఓ ముఖ్యమంత్రిగా ఆయనకు వారు అపాయింట్మెంట్స్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ టిడిపి, జనసేనలతో పొత్తుకి బీజేపీ సిద్దపడినప్పుడు, జగన్ అభ్యర్ధన మేరకు వారు వెనకడుగు వేయడం గమనిస్తే, రాష్ట్ర రాజకీయాలలో ఏపీ బీజేపీ, అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రమేయం లేకుండా అంతా ఢిల్లీ నుంచే నడిపిస్తున్నారని స్పష్టమవుతుంది.
ఏపీలో బీజేపీని బలపరుచుకొని ఎప్పటికైనా అధికారంలోకి రావలనే ఆలోచన చేయకుండా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 25 ఎంపీల మద్దతు ఉండేలా చేసుకుంటే చాలని బీజేపీ అధిష్టానం భావిస్తుండటమే ఏపీ బీజేపీకి శాపంగా మారిందని చెప్పక తప్పదు.
కనుక ఏపీలో మూడు పార్టీలని బీజేపీ పెద్దలే శాసిస్తున్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ ఆ పార్టీల నీడలోనే సేద తీరుతున్నట్లే భావించవచ్చు. కనుక ఆ మర్రిచెట్టు నీడలో బీజేపీ ఉన్నప్పుడు ఏపీలో బీజేపీ ఎలా ఎదగగలదు?






