అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు విషయంలో గందరగోళం నెలకొని ఉన్న ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా చైనా వెళ్ళి ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశమవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ట్రంప్ అక్కడ కూడా యధాప్రకారం ‘జిన్ పింగ్ నా ఆప్తమిత్రుడని’ చెప్పుకున్నారు. కానీ అలాంటి ఆప్తమిత్రుడి దగ్గరకు వెళ్ళే ముందు చైనాలో నాకేమైనా అయితే (చనిపోతే) అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తర్వాత ఏమేమి చేయాలో ట్రంప్ ఓ రహస్య లేఖ వ్రాసి తన కార్యాలయంలో ఉంచి వెళ్ళారని వైట్‌హౌస్ అధికారి సెబాస్టియన్ గోర్క్ బయటపెట్టారు.
అయితే ఇదే మొదటిసారి కాదని ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టిన తర్వాత కూడా ట్రంప్ ఇలాంటి లేఖ వ్రాసిపెట్టారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల సమయంలోనే ట్రంప్ మీద తుపాకీ కాల్పులు జరిపినప్పుడు చెవికి గాయంతో త్రుటిలో తప్పించుకున్నారు. బహుశః అప్పటి నుంచే ట్రంప్‌లో ఈ అభద్రతాభావం మొదలైనట్లుంది. ఇరాన్ యుద్ధం తర్వాత అది బాగా ఎక్కువైందని తాజా లేఖతో స్పష్టమవుతోంది.
ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, ఉత్తర కొరియా అధ్యక్షులకున్న కట్టుదిట్టమైన భద్రత ప్రపంచదేశాలలో మరెవరికీ లేదనే చెప్పాలి.
అంత భద్రత నడుమ కూడా బిక్కుబిక్కుమని జీవిస్తూ, “అందరూ నన్ను చూసి గజగజ వణికిపోతున్నారు… నా దయ కోసం కాళ్ళా వెళ్ళా పడుతున్నారని” ప్రగల్భాలు పలకడం ట్రంప్‌కే చెల్లునేమో?
జిన్ పింగ్ వంటి అత్యంత శక్తివంతమైన ఆప్త మిత్రుడి వద్దకు భారీ బందోబస్తుతో వెళ్తున్నప్పుడు కూడా ఇంకా ప్రాణ భయం ఉందంటే, ఆప్త మిత్రుడిని కూడా ట్రంప్ నమ్మడం లేదన్నమాట!
అయినా ఇరాన్‌కి రహస్యంగా ఆయుధాలు, సాంకేతిక సమాచారం అందిస్తూ సాయపడుతున్న జిన్ పింగ్‌ని ఆప్త మిత్రుడని ట్రంప్ ఎలా చెప్పుకుంటున్నారో? మళ్ళీ చైనా పర్యటనలో తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని రహస్య లేఖలు ఇంట్లో పెట్టి బయలుదేరడం ఇంకా విడ్డూరంగా ఉంది.
ఒకవేళ నిజంగానే ట్రంప్‌కి ఏదైనా జరిగితే, అప్పుడు కూడా అమెరికా ఉపాధ్యక్షుడు ఏవిధంగా నడుచుకోవాలో ట్రంప్ సూచిస్తుండటం ఇంకా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ట్రంప్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికాతో సహా యావత్ ప్రపంచదేశాలను అల్లకల్లోల్లం చేస్తూనే ఉన్నారు కదా?
కనుక జేడీ వాన్స్ కూడా ట్రంప్ బాటలో నడిచి చెడ్డ పేరు తెచ్చుకోవాలని అనుకోరు కదా? ఒకవేళ ట్రంప్‌కి ఏదైనా అయితే ఇరాన్ లేదా చైనా మీద అమెరికా అణుబాంబులు వేయాలని సూచిస్తే పాటించాలా? జేడీ వాన్స్ పాటిస్తారా? ఇదేమీ ట్రంప్ ఆస్తుల బదలాయింపుకి వ్రాసిన వీలునామా కాదు కదా జేడీ వాన్స్ అమలు చేయడానికి!




