ధోని కెప్టెన్సీలో ఇక ఇండియా గెలవదా?

Doubts on MS Dhoni Captaincy India Vs New Zealandఒకప్పుడు ఓడిపోయే మ్యాచ్ లను కూడా తన కెప్టెన్సీ మహాత్యంతో టీమిండియా వైపుకు మలుపు తిప్పిన ఘనత మహేంద్ర సింగ్ ధోని సొంతం. మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంటే… గెలిచే మ్యాచ్ లు కూడా ప్రత్యర్ధి చేతులకు సమర్పించడం. ఎవరికైనా కొంతకాలం పూర్తి అనుకూలంగా ఉంటూ… ‘పట్టిందల్లా బంగారం అవుతుంటుంది.’ గతంలో ధోనికి జరిగింది కూడా ఇదే. మరి కాలం మారిన తర్వాత వాటిని గుర్తించి, అందుకు అనుగుణంగా మసలుకోవడం విజ్ఞుల లక్షణం. మరి ధోని ఏం చేస్తున్నారు?

ఇంకా కెప్టెన్సీని పట్టుకుని జట్టుకు భారంగా మారుతున్నారు. కీపర్ గా ఇప్పటికీ ధోనియే ప్రపంచంలో అత్యుత్తమం, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, బ్యాట్స్ మెన్ గా, కెప్టెన్ గా ధోని కాలం ముగిసిపోయిందనే అనుభూతి క్రికెట్ ప్రేమికులలో వ్యక్తమవుతోంది. ఒకప్పుడు మ్యాచ్ లు ఓడిపోతే, అందుకు ధోని చెప్పే కారణాలు… కేవలం జట్టు సరిగా ఆడలేదనో, సమిష్టిగా సరైన కృషి చేయలేదనో చెప్పేవారు. అంటే… ఓటమికి గల బాధ్యత అంతా తనతో పాటు జట్టేనని ప్రత్యక్షంగానే చెప్పేవారు. కానీ, ప్రస్తుతం జరుగుతున్నదేమిటి… ఓటమి పాలైతే, దానికి కారణం జట్టు అని కాకుండా ఇతర కారణాలు అన్వేషిస్తున్నారు.

ADVERTISEMENT

తాజాగా కివీస్ తో జరిగిన నాలుగవ వన్డేలో ఓటమికి కారణాలు చెప్తూ… ఇలాంటి పిచ్ లపైన బ్యాటింగ్ చేయడం కష్టసాధ్యమని ఓ “అతి పెద్ద” కారణాన్ని చెప్పుకొచ్చారు. ఓటమికి పిచ్ ను కారణంగా చూపించినపుడే, ధోని యొక్క మానసిక స్తైర్యం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతకు ముందు మ్యాచ్ లో తను నాలుగవ స్థానంలో బరిలోకి దిగి, అద్భుతంగా ఆడారు కాబట్టి, ఆ పిచ్ బాగుంది, నేడు అదే నాలుగవ స్థానంలో వచ్చినా, సరిగా ప్రతిభ చూపలేకపోయారు కాబట్టి, పిచ్ బాలేదు అన్న కారణం చెప్పడం ఒక నాయకుడిగా ధోని ప్రస్తుతం ఎలా ఉన్నారో చెప్పకనే చెప్తున్నారు.

స్వదేశీ టీం లక్ష్యాన్ని చేధిస్తుందని, మంచి బ్యాటింగ్ పిచ్ లను తయారుచేస్తే, సెంచరీల మీద సెంచరీలు కొట్టి తమ సత్తా చాటుతారేమో? ఎంత నిర్లక్ష్యపు సమాధానం ధోని చెప్పారు?! ఇంకా నయం… శనివారం నాడు విశాఖలో ఆడబోయే మ్యాచ్ లో కూడా పిచ్ కూడా ఇలాగే ఉంటే, ఓటమి గురించి నన్ను ప్రశ్నించవద్దని చెప్పలేదు. అయినా ధోని సారధ్యంలో జట్టు విజయం సాధించట్లేదు అని చెప్పడానికి గత కొన్ని సంవత్సరాల గణాంకాలు ఉన్నాయి.

ధోని టెస్ట్ కెప్టెన్సీ వదిలిన తర్వాత పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లి, ఇప్పటివరకు ఒక్క టెస్ట్ సిరీస్ లో కూడా ఓటమి పాలు కాలేదు, అలాగే వరుసగా విజయాలు సాధిస్తూ జట్టును నెంబర్ 1 స్థానంలో నిలిపాడు. మరో వైపు వన్డే, టీ20లలో మాత్రం ధోని సారధ్యంలో టీమిండియా సిరీస్ ఓటములకు ‘బ్రాండ్ అంబాసిడర్’గా నిలుస్తోంది. మరి ఇంకెంత కాలం టీమిండియా ధోని సారధ్యంలో ఈ ఓటములను భరించాలి? తాజా సిరీస్ విషయానికి వస్తే… ప్రస్తుతం 2-2తో సమంగా నిలువగా, 29వ తేదీ తుఫాన్ కారణంగా మ్యాచ్ జరుగుతుందో లేదో అన్నది ప్రశ్నార్ధకమే! దీంతో ఈ సిరీస్ విజేతగా టీమిండియా అవతరించడం అసాధ్యమేనా? ధోని కెప్టెన్సీ ‘అవుట్ డేటెడ్’ అయిపోయిందా? కాలమే సమాధానం చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories