దేశంలో ఎక్కువగా జరుగుతున్న వాహనాల ప్రమాదాలలో కీలక పాత్ర పోషించేది మద్యం మాత్రమే. ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపడం వలనే ప్రధాన యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఇటీవల ఓ నివేదిక కూడా స్పష్టం చేసింది. దీనిని నియత్రించడానికి పోలీసులు ఎంతగా చెకింగ్ పెట్టినప్పటికీ అది కొంతవరకే పని చేస్తోంది. వాహనదారులు ఎంత జరిమానాలైనా చెల్లిస్తున్నారు గానీ, మద్యం సేవించి వాహనాలను మాత్రం పక్కన పెట్టడం లేదు.
దీనికి సెలబ్రిటీలు కూడా అతీతం కాదన్న విషయం ఇటీవల కాలంలో నమోదవుతున్న కేసులు స్పష్టం చేస్తున్నాయి. ప్రజా చైతన్యం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని భావించిన తెలంగాణా సర్కార్ ‘మిషన్ స్మార్ట్ రైడ్’ పేరుతో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీనికి సంబంధించిన అడ్వర్ టైజ్మెంట్స్ పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
‘పార్టీలో చీర్స్ కొట్టండి… రోడ్డు మీద కాదు…’ అంటూ రెండు కార్లు గుద్దుకున్న ఫోటోను ప్రచురించింది. మద్యం సేవించే సమయంలో రెండు గ్లాస్ లను కొట్టుకుంటూ ఛీర్స్ కొట్టుకోవాలి గానీ, ఇలా మద్యం సేవించి కార్ల అద్దాలు పగిలిపోయి ఛీర్స్ కొట్టుకోకూడదు అన్న సూక్తిని సాధారణ జనాలకు కూడా అర్ధమయ్యే విధంగా సుత్తి లేకుండా చెప్పడంతో ఈ పోస్టర్స్ అందరినీ ఆకర్షిస్తోంది.



