ఏపీలో కాస్త ముందుగానే ఎన్నికలట… అందరూ రెడీయేనా?

TDP YCP Janasena

ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశంలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి మంత్రులతో మాట్లాడుతూ, “ఈసారి ఓ 20 రోజుల ముందే రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కనుక అందరూ సిద్దంగా ఉండాలి. టిడిపి, దాని అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలి,” అని అన్నారు.

గత ఎన్నికల కోసం 2019, మార్చి 10వ తేదీన కేంద్ర ఎన్నికల కమీషన్‌ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 18న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించి, 25న ఫలితాలు ప్రకటించింది.

ADVERTISEMENT

ఈసారి ఓ 20 రోజుల ముందుగా ఈ ప్రక్రియ మొదలవుతుందని జగన్‌ చెప్పారు. కనుక ఫిబ్రవరి 20లోగా షెడ్యూల్, నెలాఖరులోగా నోటిఫికేషన్‌ జారీ చేయవచ్చని అర్దవుతోంది.

ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన ఈ విషయం వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలయితే, ఎన్నికల కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్న టిడిపి, జనసేన నేతలకు చాలా సంతోషం కలిగించే విషయమే. అసలు జగన్‌ ఆరేడు నెలల ముందుగా ముందస్తు ఎన్నికలకి వెళతారని టిడిపి, జనసేనలు చాలా ఆశగా ఎదురుచూసి నిరాశ చెందాయి. కనుక కనీసం 20 రోజుల ముందుగా ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని తెలిసినా చాలా సంతోషిస్తారు.

ఇంతకాలం జగన్మోహన్‌ రెడ్డి మళ్ళీ వైసీపి గెలుస్తుందని చాలా నమ్మకంగా ఉండేవారు. కానీ తెలంగాణలో కేసీఆర్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకుండా ఎన్నికలకు వెళ్ళి బోర్లా పడటంతో, జగన్‌ పునరాలోచన చేసి 11 నియోజకవర్గాల ఇన్‌చార్జిలను మార్చివేశారు. దీంతో ఆయా నియోజకవర్గాలలో అప్పుడే అలజడి ప్రారంభమైంది కూడా.

గత ఎన్నికలలో వైసీపిని గెలిపించి జగన్మోహన్‌ రెడ్డి సిఎం అయ్యేందుకు ఎంతగానో తోడ్పడిన కేసీఆర్‌ ఈసారి ఎన్నికలలో ఓడిపోవడం, ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడుకి అత్యంత ఆప్తుడైన రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వైసీపికి నష్టం కలిగించేవే అని భావించవచ్చు.

చంద్రబాబు నాయుడుని మళ్ళీ ఏదో ఓ కేసుతో జైలుకి పంపించాలని వైసీపి ప్రభుత్వం విఫలయత్నాలు చేస్తునే ఉంది. కానీ ఆయన విషయంలో మోడీ, అమిత్ షాల వైఖరి మారడంతో దాని ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇది వైసీపి అధినేతకు మింగుడుపడని విషయమే.

మరోపక్క టిడిపి, జనసేనల పొత్తులు నానాటికీ బలపడుతున్నాయి. కాంగ్రెస్‌ కూడా వాటికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్‌ స్వయంగా తన పార్టీలో సంక్షోభం సృష్టించుకోవడం వలన టిడిపి, జనసేనలకు అనుకూల వాతావరణం ఆయనే స్వయంగా సృష్టిస్తున్నారని చెప్పవచ్చు. ఓ 20 రోజుల ముందుగానే తమకు అవకాశం లభిస్తుందంటే టిడిపి, జనసేన నేతలు సంతోషించకుండా ఉంటారా?

ADVERTISEMENT
Latest Stories