ఈ తరం వారికి రాజుగారు-ఏడు చేపల కధలు తెలిసి ఉండకపోవచ్చు. ఏడు చేపలు ఎండకపోవడానికి ఎవరు కారణం? అనే చిన్న ప్రశ్నతో మొదలయ్యే ఆ కధలో చెప్పుకున్నట్లే, మన దేశంలో రాజకీయ పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అసమర్థతను, చేసిన తప్పులను, జరిగిన వైఫల్యాలను మరొకరికి ఆపాదించి తప్పించుకుంటాయి. కనుక వర్తమాన రాజకీయాలే ఏడు చేపల కధ తాజా వెర్షన్ అనుకోవచ్చు.
దీనికి ఉదాహరణగా తెలంగాణలో యూరియా కథ చెప్పుకోవచ్చు.
వర్షాకాలం మొదలైంది.. అయినా యూరియా ఎందుకు ఇవ్వరు? అని రైతులు అడుగుతున్నారు. యూరియా కోసం ఎరువుల గోదాముల వద్ద రాత్రి పగలు, ఎండా వానా అని చూడకుండా రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కానీ యూరియా దొరకడం లేదు!
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాకాలం మొదలవక ముందే రైతులకు యూరియా అందించేవాళ్ళం. కానీ ఈ అసమర్దత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు యూరియా కూడా దొరకడం లేదు. రైతుల కష్టాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా?అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రతీరోజూ సోషల్ మీడియాలో సిఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తూనే ఉంది.
రైతుల ప్రశ్నలకు, బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు!
కనుక “ఈ అసమర్థ మోడీ ప్రభుత్వం దేశంలో రైతులకు కనీసం యూరియా కూడా సరఫరా చేయలేకపోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుకనే కేంద్రం అక్కసుతో తెలంగాణకి యూరియా ఇవ్వడం లేదు. బీజేపి ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారు? వీరికీ, మోడీ ప్రభుత్వానికి రైతులు కష్టాలు పట్టవా?” అని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
“భారత్‌లో రైతులు యూరియాకి ఇబ్బంది పడుతుంటే, రష్యా చమురుతో ముడిపెట్టి పన్నులు పెంచేసి, ఆంక్షలు విధిస్తే ఎలా ట్రంప్?యూరియా కోసం భారత్ రైతులు మీకు పట్టవా ట్రంప్?” అని ప్రధాని మోడీ అడుగుతున్నారు.
“మా రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం. దాని కోసం ఎంత దూరమైనా వెళ్తాము… అంటూ పక్కనే ఉన్న చైనా వద్దకు వెళ్ళి యూరియా ఇవ్వమని కేంద్రం అడుగుతోంది. మరి చైనా ఏమంటుందో?
రాజుగారు ఏడు చేపల కథ ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా?




