జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి శాసనసభకు పోటీ చేస్తుండటంతో చిరంజీవి, రామ్ చరణ్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు మద్దతు ప్రకటించారు. వారందరూ పవన్ కళ్యాణ్‌కు ఓట్లు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించినవారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఈ ఎన్నికలలో ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
అయితే అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి శనివారం నంద్యాలలోని వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవీంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్ళడంతో జనసేన కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు ఇచ్చిన్నట్లయింది.
అల్లు అర్జున్ వచ్చిన్నట్లు తెలియగానే వేలాదిమంది అభిమానులు సంభ్రమాశ్చర్యాలతో అక్కడకు చేరుకున్నారు. అల్లు అర్జున్ వారిని ఉద్దేశ్యించి ఎటువంటి ప్రసంగమూ చేయలేదు కానీ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవీంద్ర కిషోర్ రెడ్డితో కలిసి వారికి అభివాదం చేశారు. తద్వారా తన అభిమానులను ఆయనకే ఓట్లు వేసి గెలిపించమని సూచించినట్లయింది.
ఇదే సమయంలో నంద్యాలలోనే రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు ఈ పరిణామంపై ఘాటుగా స్పందిస్తూ, “అల్లు అర్జున్ వైసీపి అభ్యర్ధి ఇంటికి వెళ్ళడం తప్పు కాదు. కానీ అక్కడ జనసేన జెండాలు ఉపయోగించడమే తప్పు. జనసేనతో వైసీపికి పొత్తు లేనప్పుడు జనసేన జెండాలతో ఏం పని?ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం తప్ప ఈ 5 ఏళ్ళలో నంద్యాల నియోజకవర్గం అభివృద్ధికి ఏమైనా చేశారా? మరి వైసీపి అభ్యర్ధికి ఎందుకు ఓట్లు వేయాలి? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి చెందినవారు కనుక పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇస్తున్నారు. కానీ పోలింగ్‌కు ముందు వైసీపి అభ్యర్ధి ఇంటికి వెళ్ళి, ఆయనతో కలిసి అభిమానులకు అభివాదం చేయడం ద్వారా నంద్యాలలో మాత్రం వైసీపి అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.
నంద్యాలలో కూటమి అభ్యర్ధిగా టిడిపికి చెందిన ఎన్‌ఎండీ ఫరూక్ పోటీ చేస్తున్నారు. కనుక ఆయనకు పడాల్సిన జనసేన ఓట్లను, అల్లు అర్జున్ అభిమానుల ఓట్లను వైసీపి అభ్యర్ధి శిల్పా రవీంద్ర కిషోర్ రెడ్డి ఈవిదంగా దారి మళ్ళించుకునే ప్రయత్నం చేసిన్నట్లు అర్దమవుతోంది. దీనినే చంద్రబాబు నాయుడు తప్పు పడుతున్నారు.
ఈ విషయంలో రామ్ చరణ్ పూర్తి స్పష్టటతో ఉన్నారు. ఆయన ఈరోజు చేబ్రోలులోని పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చి ఆయనతో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. తద్వారా పవన్ కళ్యాణ్‌కు, జనసేనకు ఓట్లు వేయాలని రామ్ చరణ్ అభిమానులకు సూచించిన్నట్లయింది.






