తెలంగాణ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కౌశిక్ రెడ్డి ”ఎన్నికలలో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్ర యాత్ర…ఒకవేళ ఓడితే శవయాత్ర” నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించండి అంటూ ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీని పై పోలీస్ స్టేషన్ లో కౌశిక్ పై కేసు నమోదయ్యింది. అలాగే తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆయనకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
అక్కడితో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా కూడా కౌశిక్ రెడ్డి తన కుటుంబసభ్యులైనా భార్య, కూతురు తో కలిసి ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో కూడా కౌశిక్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. అతని భార్య కూడా కొంగు పట్టి అడుగుతున్నా మీ ఓటుతో నా భర్తను గెలిపించండి అంటూ అలాగే ఆయన కూతురు దండం పెట్టి అడుగుతున్నా మా నాన్నను గెలిపించండి, ఆయనను మీరే కాపాడుకోండి ప్లీజ్..,అంటూ ఒక పక్క అభ్యర్థిస్తూ మరో పక్క మీరు ఓటేస్తారా లేక నన్ను చావంటారా అంటూ ఓటర్లను బెదిరిస్తూ ఎన్నికల ప్రచారానికి ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చారు కౌశిక్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు.
ఈ వీడియోను చూస్తున్న ఓటర్లు మాత్రం ఇప్పుడు ఓటెయ్యకపోతే నేను చస్తాను అంటూ బెదిరిస్తున్న ఆయన రానున్న రోజులలో ఓటెయ్యకపోతే మిమ్మల్ని చంపుతా అంటూ బయపెడతారేమో! ఇదెక్కడి ప్రచారంరా సామి అంటూ నవ్వుకుంటున్నారు. అభివృద్ధిలో కొత్తదనాన్ని కోరుకుంటున్న ప్రజలకు ప్రచారంలో కొత్తదనాన్ని చూపించి అటు ఓటర్లను ఇటు ఈసీ ను ఆచ్చర్యపరిచారు కౌశిక్. ఇంతకీ ఈయనగారు తలపడుతుంది ఒకప్పటి బిఆర్ఎస్ ముఖ్య నేత ఇప్పటి బీజేపీ పార్టీలో కీలక నేత అయిన ఈటెల రాజేంద్ర ప్రసాద్.
పోటీలో సీనియర్ నేత ప్రత్యర్థిగా ఉండడంతో ఇక గెలవాలంటే ప్రజల్లో సానుభూతి పుట్టించడం అనివార్యమని భావించి కౌశిక్ కుటుంబసబ్యలతో కలిసి ఇటువంటి ప్రచారాన్ని ఎంచుకొనివుంటారు. ఏదిఏమైనా ప్రజల సానుభూతి మాట అటుంచితే పోలీస్ కేసులు, ఈసీ విచారణలు మాత్రం ఎదుర్కోకతప్పదని ఇప్పుడు అర్ధమయినట్టుంది సదరు బిఆర్ఎస్ అభ్యర్థికి.




