ఆపధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభలలో ప్రసంగిస్తూ ఒక్క ఓటు మీ ఐదేళ్ల భవిష్యత్తు…ఆలోచించి అడుగేయండి అంటూ ఓటర్లకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. అవును ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజమేగా…
గత ఎన్నికలలో వేసిన ఒక్క ఓటు తో ఐదేళ్ల రాష్ట్ర రాజధాని అమరావతి భవిష్యత్తు ఎటుపోయిందో ఎవరికి అర్ధం కానీ పరిస్థితి. పోలవరం ప్రాజెక్ట్ ఏనాటికి పూర్తి అవుతుందో తెలియని దుస్థితి. కొండలకు ఎందుకు గుండులు కొడుతున్నారో చెప్పే నాధుడే లేడు. విశాఖ ఉక్కు ప్రభుత్వం నుండి ఎందుకు చేజారుతుందో తెలిపే నాయకుడు కరువయ్యాడు.
సొంత బాబాయ్, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, మాజీ మంత్రి హత్యకు కారణం ఎవరో, కోడికత్తి కేసులో అంతర్యం ఏమిటో, దళితుల మీద జరుగుతున్న దాడులకు ఊతం ఇస్తుంది ఎవరో, దేవాలయాల పై జరిగిన దాడులకు దోషులెవరో ఈ ఐదేళ్ల కాలంలో తేల్చలేని ప్రభుత్వాలకు ఈ మాట అనే హక్కు ఉందా అనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒక్క ఓటు ఫలితంతో బటన్ ముఖ్యమంత్రికి పదవి బాధ్యతలు అప్పగించడం ఫలితంగా రాష్ట్రానికి పెరిగిన అప్పెంత..? ప్రజలకు పెరిగిన చార్జీల మొతెంత..? కరెంట్ బిల్లు నుంచి పప్పు, ఉప్పు, పెట్రోల్, డీజిల్, ఆస్తి పన్ను,చెత్త పన్ను లతో బాదిన బాదుడేంత..? ఈ ఒక్క ఓటు ఫలితంతో రాని జాబులతో బలైపోయిన నిరుద్యోగుల జీవితాలెన్ని..? ఒక్క ఇసుక పాలసీ మార్పుతో ఎన్ని జీవితాలు ఆకలి మంటకు ఆహుతయ్యాయో చెప్పగలరా..?
అవును నిజమే ఓటు ఐదేళ్ల భవిష్యత్తే….ఈ ఓటు వలన పోయిన ఐదేళ్ల భవిష్యత్తుని తిరిగి తెచ్చే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అంటూ నిలదీస్తున్నారు నిరుద్యోగ యువత, రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాలు. ఒక్క ఓటు ఫలితంగా తమ జీవితాలు చెల్లాచెదురయ్యాయి అంటూ ఆనాటి నుండి ఈ నాటికీ రోడ్డు మీదే కన్నీటితో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అమరావతి రైతు కుటుంబాలు.
వారి కన్నీటికి విలువెంత..? వారి ఆక్రందనలకు న్యాయం ఎక్కడా..? అవును ఓటు విలువ ఐదేళ్ల భవిష్యత్తే… ఈ ఓటుతో రాష్ట్రంలోకి అడుగుపెట్టిన కల్తీ మద్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు దిక్కెక్కడ..? పోయిన ప్రాణాలతో అనాధలుగా మారిన జీవితాలకు భవిష్యత్తు ఎక్కడ..? ఈ ఓటు ఫలితంగా ఏర్పడిన ప్రభుత్వం తన పదవిని తిరిగి నిలబెట్టుకోవడానికి మొదలుపెట్టిన పిన్షన్ల రాజకీయ చదరంగంలో బలవుతున్న వారికీ జవాబెక్కడ..?
ఈ ఐదేళ్ల కాలంలో పోయిన పెట్టుబడుల విలువెంత..? దాని వల్ల కోల్పోయిన ఉద్యోగాల అంకెంత..? రాష్ట్రానికి వచ్చిన డ్రగ్స్ బరువెంత..? దానికి బానిసలై జీవితాలను కోల్పోతున్న వారి భవిష్యత్తుకు దారెక్కడ..? వీటన్నింటికి సమాధానం చెప్పగలిగిన నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగానికి విలువ – విశ్వసనీయత రెండు ఏకపక్షంలో దక్కుతాయి. మరి సమాధానం చెప్పే సాహసం చేయగలరా..?




