ఎన్నికలు: పార్టీలకు ప్రాణసంకటం..ఓటర్లకు ప్రీతిపాత్రం..!

Bihar Elections 2025

ఏడాది మొత్తం కష్టపడి చదువుకున్న చదువు విలువ ఒక్క ఎగ్జామ్ డిసైడ్ చేస్తుంది అనేలా ఐదేళ్లు ఎన్నో వ్యూహాలు , మరెన్నో ప్రణాళికలు వేసి నడిపిన ప్రభుత్వం తాలూకా పనితనాన్ని ఒక్క ఎన్నికలు నిర్దేశిస్తాయి.

అయితే అక్కడ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే సప్లి ల రూపంలో వెంటనే మరో అవకాశం దక్కుతుంది. కానీ ఇక్కడ ఒక్కసారి ఎన్నికలలో ఓడితే మరో ఐదేళ్లు కళ్ళుమూసుకోవడమే అవుతుంది, ఒక్కో సందర్భంలో పార్టీని కూడా మూసెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది.

ADVERTISEMENT

అలా ఎన్నికలు అనేది రాజకీయ పార్టీలకు ప్రాణసంకటంగా మారిపోతుంటే, ఇక తమ ఓటు హక్కుతో రాజకీయ పార్టీల భవిష్యత్ రాసే ఓటర్లకు మాత్రం ఎన్నికలు అత్యంత ప్రీతిపాత్రంగా మారిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం రాజకీయ పార్టీలు ఇస్తున్న ఎన్నికల హామీలు.

ప్రత్యర్థి పార్టీలను అధికారానికి దూరం చెయ్యాలి అన్నా, సొంత పార్టీని తిరిగి అధికారం దిశగా నడిపించాలి అన్నా అందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలో భాగంగా ప్రకటిస్తున్న ఉచిత పథకాలు ఓటర్లను తమ వైపుకి రప్పిస్తున్నాయి.

అందుకు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడా ఏమి లేదు, అలాగే ఈ పార్టీ ఆ పార్టీ అనే వ్యత్యాసం కూడా ఏమి ఉండదు. ఒకరు రైతు బందు అంటే మరొకరు రైతు మిత్ర అంటారు, అలాగే ఒకరు అమ్మ ఒడి అంటే మరొకరు తల్లికి వందనం అంటారు.

ఇలా పథకాల పేర్లు మార్పే తప్ప ఉచితాలకు మాత్రం కొదవులేదు అనేలా దేశవాళీ ఎన్నికలు ఓటర్లకు ఫ్రీ ఆఫర్స్ తో పథకాల విందు చేస్తున్నాయి. తాజాగా బీహార్ లో జరగనున్న ఎన్నికల పోరుకి ఇరు వర్గాల మధ్య ఈ ఉచితాల పోటీ తారాస్థాయికి చేరింది.

అధికార కూటమి పార్టీ జేడీయూ – బీజేపీ మహిళలకు స్వయం ఉపాధి పథకం కింద 10 వేలు ప్రకటిస్తే అధికారాన్ని ఆకాంక్షించే పార్టీ ఆర్జేడీ మహిళలకు “జీవిక సీఎం” స్కీమ్ పేరిట నెలకు 30 వేలు అంటూ ప్రకటించింది. అలాగే లోన్ల పై వడ్డీ మాఫీ అంటూ హామీ ఇచ్చింది.

ఇలా అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ది కోసం మోతాదుకు మించి పథకాలు హామీలుగా ఇస్తుంటే రాష్ట్ర ఖజానా మొత్తం ఈ పథకాల అమలు కోసమే వెచ్చించాల్సి వస్తుంది. కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఉచిత పథకాల అమలు కోసం వేల కోట్ల అప్పులు తప్పడం లేదు.

అయితే గెలుపు కోసం రాజకీయ పార్టీల ఇస్తున్న ఈ ఉచితాలు ఓటర్లకు మాత్రం అత్యంత ప్రీతిపాత్రంగా మారుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలను మార్చడంతో ఈ ఉచిత పథకాల లబ్ది కూడా రెండింతలవుతుంది అనే ఆలోచన ఓటర్ల మదిలోకి వెళ్ళిపోతుంది.

దీనికి ఎక్కడో అక్కడ రాజకీయ పార్టీలు ఒక ఎండ్ కార్డు వేయకపోతే మరికొన్ని తరాలు భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది, లేదా అభివృద్ధి చెందాల్సిన దేశం అంటూ దిగజారే పరిస్థితి రావచ్చు.

ADVERTISEMENT
Latest Stories