దేశంలో ఐదేళ్ళ కోసారి లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వాలు మారుతుంటాయి. లేదా అవే మళ్ళీ కొనసాగుతుంటాయి.
గతంలో అంటే ఓ మూడు నాలుగు దశాబ్దాల క్రితం వరకు ప్రభుత్వాలు మారినప్పుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దయనీయంగా ఉందనే మాటలు పెద్దగా వినిపించేవి కావు. కానీ ఇప్పుడు ఎక్కడ ఏ పార్టీ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మొట్టమొదటి చెప్పే మాటే ఇది. ఖాళీ ఖజానా… అప్పుల భారం.
గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి, అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దోచేసుకుందని, దాని వలన ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పడం పరిపాటిగా మారింది.
మన దేశ, రాష్ట్రాల రాజకీయాలలో ఇవి ఏళ్ళ తరబడి పునరావృతం అవుతూనే ఉన్నాయి. అంటే ఐదేళ్ళకోసారి అని చెప్పుకునే బదులు ఖాళీ ఖజానా నుంచి ఖాళీ ఖజానా వరకు పాలన అని చెప్పుకోవడం సబబుగా ఉంటుందేమో?
ఎందువల్లనంటే ఖాళీ ఖజానాతో పాలన మొదలుపెట్టామని తెలిసి ఉన్నప్పుడు ముందుగా ఆ లోటు పూడ్చే చర్యలు చేపట్టాలి. కానీ కొత్త ప్రభుత్వాలు కూడా ప్రజల మెప్పు పొందేందుకు మరిన్ని అప్పులు చేసి మరీ అవసరం లేని కొత్త పధకాలు అమలు చేస్తున్నాయి తప్ప ఎవరూ వీటికి బ్రేక్ వేయాలని అనుకోవడం లేదు.
ఇప్పటికే వివిధ కారణాల వలన సామాన్య ప్రజలపై భారం పడుతూనే ఉంది. కానీ రాజకీయాల కోసం ఆర్ధిక పరిస్థితిని పణంగా పెడుతున్నారన్న మాట! పాలకులలో ఆర్ధిక క్రమశిక్షణ కూడా లోపిస్తునందున భవిష్యత్‌లో భారత్ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తోంది.






