గత 5 ఏళ్ళుగా మూడు రాజధానులు, విశాఖ రాజధాని కధలతో పొద్దు పుచ్చిన జగన్ ప్రభుత్వం, ఓ గొప్ప అవకాశాన్ని చేజార్చుకుందని మాత్రం చెప్పవచ్చు. ఆ కధ అప్రస్తుతం.
జగన్ ప్రభుత్వం విశాఖ రాజధాని ఏర్పాటు చేయలేదు. కానీ ‘అది వద్దని టిడిపి నేతలు చెప్పగలరా?’ అంటూ సవాళ్ళు విసిరేవారు.
కానీ ఇప్పుడు ‘వైసీపి నేతలు అమరావతి వద్దని చెప్పగలరా?’ అని టిడిపి ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేరు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే అమరావతిపైనే దృష్టి పెట్టారు. త్వరలోనే రూ.15,000 కోట్లు దీర్గకాలిక రుణం ప్రభుత్వం చేతికి అందబోతోంది. కనుక నిర్మాణ పనులు మళ్ళీ వేగవంతం కావచ్చు.
గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సిఎం చంద్రబాబు నాయుడు రాబోయే 5 ఏళ్ళలో అమరావతికి రూపురేఖలు తీసుకురావడం ఖాయమనే చెప్పవచ్చు. తద్వారా భవిష్యత్‌లో ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధానిని కాదనలేని పరిస్థితి కల్పిస్తారు.
ఈవిషయం జగన్, వైసీపి నేతలందరూ గ్రహించి, అంగీకరించిన్నట్లే ఉన్నారు. బహుశః అందుకే జగన్‌తో సహా అందరూ ఇతర అంశాల గురించి మాట్లాడుతున్నారే తప్ప ఎవరూ కూడా అమరావతిలో జరుగుతున్న హడావుడి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు.
చంద్రబాబు నాయుడుని, అమరావతిని జగన్ ఎంతగా ద్వేషించినా, అక్కడ ఆయన నిర్మింపజేసిన సచివాలయం, శాసనసభలోనే కూర్చొని 5 ఏళ్ళు పాలన సాగించక తప్పలేదు.
కనుక జగన్ చెప్పుకున్నట్లు 5 ఏళ్ళు కళ్ళుమూసుకొని కూర్చుని మళ్ళీ అధికారంలోకి రాగలిగితే అప్పటికే పూర్తిగా అభివృద్ధి చెందిన అమరావతిని కాదని విశాఖకు వెళ్ళలేరు.
కానీ జగన్ ఒకే ఒక్క ఛాన్స్ ఇమ్మనమని అడిగారు… ప్రజలు ఇచ్చారు. కనుక ఇక ఎప్పటికీ జగన్‌కు రెండో ఛాన్స్ లభించకపోవచ్చు.
కనుక తాను వద్దనుకున్న అమరావతి తన కళ్ళ ముందే రూపురేఖలు సంతరించుకొని విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంటే చూస్తూ, తనకు దక్కాల్సిన ఆ క్రెడిట్ చేజార్చుకొని చంద్రబాబు నాయుడుకి ఇచ్చేశానే అని లోలోన బాధపడుతూ పైకి వెకిలి నవ్వు నవ్వక తప్పదు.






