ప్రస్తుతం హార్రర్ సినిమాలకున్న క్రేజ్ మరే ఇతర సినిమాలకు లేవు. దీంతో అన్ని ‘వుడ్’లలో హార్రర్ సినిమాల నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది. అలా ఇతర భాషల్లో నిర్మించుకుంటున్న హార్రర్ సినిమాలను తెలుగులోకి అనువాదం చేసే పనిలో కొందరు నిర్మాతలు ఉన్నారు. బహుశా వారి కంట మలయాళం మూవీ “ఎజ్రా” పడలేదేమో గానీ, ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగా ఉంది.
ఊరు, పేరు తెలియని “చిన్నారి” వంటి చిన్న సినిమాలను కూడా డబ్బింగ్ రూపంలో తెలుగులోకి తీసుకువస్తున్న తరుణంలో… తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితమైన పృధ్వీరాజ్ వంటి హీరో, ప్రియ ఆనంద్ వంటి తెలుగు హీరోయిన్ ఉండి కూడా ఈ సినిమాపై తెలుగు నిర్మాతల కన్ను పడకపోవడం విశేషమే. బహుశా తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే… ఖచ్చితంగా ఈ సినిమా తెలుగునాట సందడి చేయడం ఖాయమన్న నమ్మకాన్ని “ఎజ్రా” ట్రైలర్ కలిగించింది.
హార్రర్ సినిమాల ట్రైలర్స్ చూస్తుంటే… భయం విషయం పక్కన పెడితే, కనీసం చూడాలన్న ఆసక్తిని పెంపొందించకుండా, కామెడీని పండిస్తున్నాయి. కానీ “ఎజ్రా” ట్రైలర్ లో ఫస్ట్ షాట్ అయిన పేపర్ పట్టుకుని నిల్చున్న వ్యక్తి నుండి చివరి షాట్ వరకు ఆసక్తికరంగా సాగింది. నటీనటుల హావభావాలకు తోడు, హార్రర్ సినిమాలలో కీలక పాత్రలు పోషించే ఫోటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విభాగాలు “ఎజ్రా”కు ప్లస్ పాయింట్స్. ఈ నెలలో మలయాళంలో విడుదల కానున్న ఈ సినిమా సక్సెస్ అయితే, తెలుగునాట ప్రత్యక్షం కావడం పెద్ద విషయమేమీ కాదు.



