ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల సూత్రం అమరావతి రైతుల గుండెలలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే వారు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చేసిన ఈ చర్యతో ముఖ్యంగా వైసీపీకి చెందిన రైతులు అవాక్కయ్యారు.
జగన్ ఎన్నికల ముందు అమరావతికి కట్టుబడతాం అని మేనిఫెస్టో కమిటి చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో చెప్పించి తమని నమ్మించి మోసం చేశారని వారు అంటున్నారు. జగన్‌కు ఓటు వేసి మోసపోయామని వారు వాపోవడం గమనార్హం. పైగా జగన్ కు ఓట్లు వేసి గెలిపించినందుకు గ్రామాలలో తమను విలన్లుగా చూస్తున్నారని అంటున్నారు.
నిన్న తుళ్లూరులో రాజధాని రైతులతో సమావేశమైన అధికారపార్టీకి మద్దతు దారులైన రైతులు జగన్ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండేవిధంగా ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పోరాటం జరుపుతామని ప్రకటించారు.
తమ భూములు ఇప్పుడు తిరిగి ఇచ్చినా వ్యవసాయానికి పనికి రావని, ఇవ్వకుండా ప్లాట్లు ఇచ్చినా ప్రస్తుత పరిస్థితులలో వాటి వల్ల ఉపయోగం లేదని వారు అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే రాజధాని భూముల ధరలు సగానికి పడిపోయాయి. ముఖ్యమంత్రి ప్రకటనతో ఆ రేట్లకు కూడా కొనే వారు లేరు అంటున్నారు.



