‘అంచనాలు తక్కువ – ఆదాయం ఎక్కువ’ అన్న దానికి నిదర్శనంగా నిలిచిన “ఫిదా” సినిమా కలెక్షన్స్ కు ఇప్పట్లో బ్రేకులు పడేలా కనపడడం లేదు. అమలాపురం టు అమెరికా వరకు అద్వితీయమైన రెవిన్యూను వసూలు చేస్తోన్న ఈ సినిమా నైజాం ఏరియాలలో ఏకంగా ‘నాన్ బాహుబలి’ రికార్డులను అందుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అదేంటి… ఇదెలా సాధ్యం అని అడగకండి..! ఎందుకంటే… ‘ఫిదా’ ఊపు ఆ రేంజ్ లో ఉంది మరి!
తెలంగాణా నేపధ్యంలో సాగిన ఈ సినిమాకు నైజాం నాట ప్రేక్షకులు కనకవర్షం కురిపిస్తున్నారు. నాలుగు వారాలు కలిపి దాదాపుగా 17 కోట్లు పైనే షేర్ వసూలు చేసిన “ఫిదా,” మూడు, నాలుగు వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో ‘నాన్ బాహుబలి’ రికార్డులు వశం కావడం చెప్పుకోదగ్గ విషయమే. ఒక్క మూడవ వారంలోనే 3.26 కోట్లు కొల్లగొట్టగా, నాలుగవ వారంలో 1.47 కోట్లు కైవశం చేసుకుని, ‘బాహుబలి’ సినిమా తర్వాత సింగిల్ వీక్స్ లో ఆ రేంజ్ కలెక్షన్స్ ను సాధించిన చిత్రంగా “ఫిదా” నిలిచింది.
ఊహించని ఈ విజయంతో చిత్ర యూనిట్ అంతా ఫుల్ ఖుషిలో ఉంది. విజయం సాధిస్తుందని అంచనా వేసుండొచ్చు గానీ, మరీ ఈ రేంజ్ సక్సెస్ మాత్రం అంచనాలకు అందనిదని చెప్పవచ్చు. హీరోయిన్ సాయిపల్లవి అభినయం వలనే ఇంత సక్సెస్ సాధ్యమైందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ సినిమా విడుదలకు ముందు వరుణ్ తేజ్ చెప్పిన… స్టార్ హీరోలు జాగ్రత్త…. మా సాయి పల్లవి వచ్చేస్తోంది అని చెప్పిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా నిజమయ్యాయని చెప్పాలి.


