స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్ ప్రతీప్ చౌదరి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్‌బీఐ దేశంలో నగదు పరిస్థితి గురించి ప్రజలకు అసత్యాలు చెబుతోందని, భారత్ లో ప్రస్తుతం నగదు కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియలో ఆర్‌బీఐ పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని, వాస్తవాలను దాచిపెడుతూ తప్పించుకోకూడదని వ్యాఖ్యానించారు.
దేశంలో పేరుకు పోయిన బ్లాక్ మనీని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య సరైంది కాదని ప్రతీప్ చౌదరి అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో నకిలీ నగదును మాత్రమే అరికట్టగలమని, నల్లధనాన్ని నిరోధించలేమని, దేశంలో నగదు కొరత ఇబ్బందుల పోయి సాధారణ స్థితి ఏర్పడడానికి మరో మూడు నెలల సమయం పడుతుందని అన్నారు. దేశంలో ద్రవ్య వినియోగం దెబ్బతిందని, దీంతో భారత ఆర్థిక వ్యవస్థపై శాశ్వత ప్రభావం పడిందని, దేశంలో సరిపడినంత నగదు ఉందని ఆర్‌బీఐ చెబుతున్నదంతా అవాస్తవమేనని చెప్పారు.
సరిపడినంత నగదు ఉంటే, భారత్ లోని 2 లక్షల ఏటీఎంలలో ఒక్కో దానిలో కోటి రూపాయలు ఎందుకు ఉంచడం లేదని ప్రతీప్ చౌదరి ప్రశ్నించారు. ప్రతి ఖాతాదారుడు ఏటీఎంలలోంచి 5,000 లేదా 10,000 డ్రా చేసుకోవచ్చని ఎందుకు ప్రకటించడం లేదని అన్నారు. బాధలు తీర్చాల్సిన ఆర్‌బీఐ అసత్యాలు చెబుతూ పారిపోతోందని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నిర్ణయంతో ఏర్పడే పరిస్థితులని అంచనా వేయడంలో, సమర్థవంతంగా చర్యల్ని తీసుకోవడంలో కేంద్ర సర్కారు విఫలమైందని ఉద్ఘాటించారు.



